బెజవాడలో దుర్గమ్మ ఫీజులు తగ్గింపు


విజయవాడ, మే 31, (way2newstv.com)
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోడానికి ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. అమ్మవారి దర్శనంలో సామాన్యులకు మరింత వెసులుబాటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా దర్శన టిక్కెట్ ధరలను తగ్గించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. టిక్కెట్ ధరల తగ్గింపుపై కనకదుర్గమ్మ ఆలయ ఈఓ కోటేశ్వరమ్మ తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి‌ని ప్రేరణగా తీసుకున్నామని ఆమె తెలిపారు. 


బెజవాడలో దుర్గమ్మ ఫీజులు తగ్గింపు
భక్తులకు ఉచిత సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామని ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకూ భక్తుల మొబైల్ భద్రపరిచే లాకర్ కోసం రూ.5 వసూలు చేయగా, ప్రస్తుతం దానిని రద్దు చేశారు. మొబైల్స్ లాకర్‌ సేవలు ఉచితంగానే అందజేస్తున్నారు. అలాగే పాదరక్షలు, సామాన్లు భద్రపరిచే క్లోక్ రూమ్‌ల సేవలను కూడా ఉచితంగా అందజేస్తున్నట్టు కోటేశ్వరమ్మ వివరించారు. ప్రస్తుతం శీఘ్రదర్శనం కింద అంతరాలయంలోకి వెళ్లడానికి ఒక్కొక్కరికీ రూ.300 వసూలు చేస్తుండగా, దానిని రూ.200 చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపామని, ఆమోదం లభించగానే తగ్గిన టిక్కెట్ల ధరలు అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. గతంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి రూ.140 కోట్ల మేర డిపాజిట్లు ఉండేవని, ఆలయ విస్తరణ పనులు, స్థల సేకరణ నిమిత్తం ఆ వాటిని వినియోగించినట్టు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు రూ.18 కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో జమ చేసినట్లు వివరించారు. 
Previous Post Next Post