తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కావొస్తోంది. కానీ పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 8 తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం.తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 119. మొత్తం 20 మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముంది. ఐతే డిసెంబరు 13న కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 19న మరో పది మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. దాంతో తెలంగాణ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కు చేరింది. మరో 8 మందిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే వీలుంది.
ఆ 8 మంది ఎవరో...
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు కేసీఆర్ కసరత్తులు మొదలుపెట్టారు.మంత్రివర్గ విస్తరణంలో కొత్తగా ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరిపై వేటు పడుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత ప్రభుత్వంతో పాటు ఇప్పడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనూ వారికి పదవులు కేటాయించలేదు. ఐతే ఈసారి మంత్రివర్గ విస్తరణంలో మహిళలకు చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు వస్తాయని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో...ఆ రెండు పోస్టులు ఎవరికి దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు కొందరు మంత్రులకు ఉద్వాసన పలకవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. దానికి మంత్రులను బాధ్యులను చేసే అవకాశముంది. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యత చూసిన మంత్రులపై వేటువేయవచ్చని ప్రచారం జరుగుతోంది. దాంతో పలువురు మంత్రుల్లో ఆందోళన మొదలైంది.మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో హరీష్ రావు పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మిషన్ కాకతీయ, మిషన్ భగీరత, కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఐతే కొత్త ప్రభుత్వంలో మాత్రం ఆయనకు అవకాశం కల్పించలేదు. ఆయనకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ లోక్‌సభ ఎన్నికలపై పడిందని..టీఆర్ఎస్‌కు ఆశించిన లోక్‌సభ స్థానాలు అందుకే రాలేదన్న వాదనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Tags:
telangananews