ముంచుకొస్తున్న వాన కాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముంచుకొస్తున్న వాన కాలం


కొండ వాసుల్లో భయం..భయం
విజయవాడ, జూన్ 5, (way2newstv.com)
బెజవాడలో బండ'లే వారి పాలిట గుది 'బండ'లుగా మారుతున్నాయిచిన్నపాటి వర్షం కురిస్తే చాలు కొండ ప్రాంత వాసుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఎటువైపు నుంచి కొండరాయి దొర్లి నెత్తిన పడుతుందో, ఎక్కడ రిటైనింగ్‌ వాల్‌ కూలుతుందో తెలియని పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు లక్ష మందికి పైగా పేద, మధ్యతరగతి ప్రజలు వారి పరిస్థితిని బట్టి కొండ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. ఎక్కువమంది పేదలు కావటంతో కొండలను ఆశ్రయించి నిర్మాణాలు చేసుకున్నారు. అంతేగాక మరికొన్ని కుటుంబాలవారు తక్కువ అద్దెల కోసం కొండలపైకి చేరి నివాసం ఉంటున్నారు. గూడులేని నిరుపేదలు కొద్ది స్థలం కనబడితే చాలు ప్రమాదమని తెలిసినా లెక్కచేయకుండా కొండలపైనే ఇళ్లు నిర్మించుకొని కాలం వెళ్లదీస్తున్నారు. 


ముంచుకొస్తున్న వాన కాలం
ఇక తుపాన్‌ల సమయంలో కొండ ప్రాంతంలో నివసించే వారు ఏ రాళ్లు వచ్చి ఇంటిపై పడతాయో, ఏ రిటైనింగ్‌ వాల్‌ కూలుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. కిందటి ఏడాది నాలుగు స్తంభాల సెంటర్‌ కొండ ప్రాంతంలో ఆరు బయట మంచం మీద నిద్రిస్తున్న వ్యక్తిపై కొండరాయి పడటంతో నిద్రలో మంచంమీదే మృతిచెందాడు. సితార థియేటర్‌ ఎదురుగా పెద్ద కొండ చరియ విరిగిపడిన సంఘటన కూడా చోటుచేసుకుంది. కొంతమంది కొండపై కొత్తగా ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు నిర్మించేందుకు పునాదుల కోసం కొండను తవ్వుతున్న సమయంలో రాళ్లు జారి కిందగా ఉన్న ఇళ్ళపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌ వద్ద రిటైనింగ్‌వాల్‌ జారి కింద ఉన్న ఇళ్ళపై, తాగునీటి పైప్‌లైన్లపై పడటంతో పైపులైన్లు మార్చాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అంతే గాక పైపులైన్లు లీకేజీల వల్ల మెట్లపై నీరు పారుతుండంతో ప్రమాదాల బారిన పడు తున్నారు. ఇక నానుడు వర్షాలకు కొండ ప్రాంత రిటైనింగ్‌ వాల్స్‌ కూలిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కిందటి యేడాది వర్షాలకు రాము క్వారీ, కొండబడి ఎదురుగా, కబేళా రోడ్డు, రావిచెట్టు సెంటర్‌ కొండ ప్రాంతాల్లో రిటైనింగ్‌ వాల్స్‌ కూలాయని స్థానికులు చెబుతున్నారు. కూలిపోయిన రిటైనింగ్‌వాల్స్‌, శిథిలమైన మెట్లు, సైడు డ్రెయిన్లు కూడా మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎలా ఉంటుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.