ఐదేళ్లు ఓపిక లేకపోవడం… దీర్ఘకాలం రాజకీయాలను దూరం చేసిందనే చెప్పాలి. అదే ఆయన ఓపిక పట్టి ఉంటే ఈరోజు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారేవారు. ఆయనే సీనియర్ నేత మైసూరా రెడ్డి. మైసూరారెడ్డి తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విభేదాలున్నప్పటికీ జగన్ కు అండగా నిలబడదామని ముందుకు వచ్చారు. జగన్ కూడా మైసూరారెడ్డికి మంచి ప్రయారిటీ ఇచ్చారు. మైసూరారెడ్డి 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.ఆయన తర్వాత ఏ పార్టీలో చేరలేదు. రాయలసీమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. మైసూరారెడ్డి మరో మూడేళ్లు ఓపిక పట్టి ఉంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో ముఖ్యనేతగా మారేవారు.
మైసురాకు కలిసి రాని కాలం
రాజ్యసభ పదవి లాంటిది దక్కేదన్న టాక్ విన్పిస్తోంది. మైసూరారెడ్డికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. హోంమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన మైసూరాను ఆ పార్టీ తగిన రీతిలో గౌరవం ఇచ్చింది.రాజ్యసభ పదవి ఇచ్చింది. రెండోసారి రెన్యువల్ చేయలేదు. తెలుగుదేశం పార్టీలోనే ఉండి అప్పట్లో జగన్ తో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపట్టడంతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అప్పుడే వైసీపీలో చేరారు. కానీ జగన్ పార్టీలోనూ ఎంతకాలమో ఉండలేదు. అక్కడి నుంచి బయటకు రావడానికి కారణం కూడా రాజ్యసభ టిక్కెట్ అన్న ప్రచారం ఉండనే ఉంది. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మైసూరా అన్ని పార్టీలకూ దూరంగానే ఉన్నారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు త్వరలోనే తాను రాజకీయ ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో మైసూరా మళ్లీ టీడీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. జనసేనలోకి వెళతారన్న టాక్ కూడా కొంతకాలం నడిచింది. అయితే మైసూరా మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఏపీ రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే గౌరవమైన పదవి దక్కి ఉండేదని, మైసూరా ఓపికలేక ఛాన్స్ మిస్ చేసుకున్నారని ఆయన అభిమానులు సయితం ఆవేదన చెందుతున్నారు.
Tags:
Andrapradeshnews