ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. రాజ్యసభలో ఆయన ఇవాళ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ.. సభలో ఎందుకు కొందరు సభ్యులు ఈవీఎం అంశాన్ని ప్రస్తావిస్తున్నారని అడిగారు. మా పార్టీకి మొదట్లో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు, మమ్ముల్ని చూసి జనం నవ్వుకున్నారు, కానీ మేం కష్టపడ్డాం, ప్రజల విశ్వాసాన్ని గెలిచాం, మేం ఏనాడూ పోలింగ్ బూత్‌లను నిందించలేదని మోదీ అన్నారు.
ఈవీఎంల గూర్చి ఎందుకు ప్రశ్నిస్తున్నారు?:ప్రదాని మోదీ
దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ప్రగతిని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1950 దశకంలో పోలింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది, బూత్ ఆక్రమణ, హింస లాంటి సంఘటనలు జరిగేవి, కానీ ఇప్పుడు ఓటర్ల టర్నౌట్ కీలకమైందని, ఇదొక రకంగా ఆరోగ్యకరమైన సంకేతమన్నారు. ఈవీఎంలతో ఇప్పటికే ఎన్నో ఎన్నికలను నిర్వహించారని, అనేక పార్టీలు కూడా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పాలించాయని, కానీ ఇప్పుడు ఈవీఎంలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మోదీ అడిగారు. ఈవీఎంల గురించి ఎన్నికల సంఘం ఆహ్వానిస్తే.. కేవలం రెండు పార్టీలు మాత్రమే వెళ్లాయని, ఆ పార్టీలు తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నాయన్నారు. ఎప్పుడూ ఆరోపణలు చేస్తున్న విపక్ష పార్టీలు ఎందుకు ఈసీ వద్దకు వెళ్లలేదని మోదీ ప్రశ్నించారు.