సిటీలో పార్కింగ్ కు దారేదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో పార్కింగ్ కు దారేదీ

విజయవాడ, జూన్ 10, (way2newstv.com)

నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా మారిన తరువాత నగరంలో ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికితోడు వాహనాల వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో వాటి నిలుపుదలకు సరైన ప్రదేశం లేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. రోజురోజుకీ నగరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ సదుపాయం మాత్రం కనిపించడం లేదు. వాహనదారులు రహదారులపైనే పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాహనాల పార్కింగ్‌ను అడ్డదిడ్డంగా చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో మనిషి నిల్చునేంత స్థలం కూడా వదలకుండా నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పార్కింగ్ ప్రదేశాలను మాత్రం కేటాయించడం లేదు. 


సిటీలో పార్కింగ్ కు దారేదీ
దీంతో వాహనదారులు తమ వాహనాలను రహదారులపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరంలోని చాలాచోట్ల నో పార్కింగ్ బోర్డులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా వాహనదారులు పార్కింగ్ చేస్తూనే ఉంటున్నారు. వాణిజ్య సముదాయాల ముందు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ లేక రహదారిపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇక అపార్ట్‌మెంట్ల సంస్కృతి బాగా పెరిగిన నగరంలో యాజమానులకు మాత్రమే పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. వచ్చే అతిథుల వాహనాల పార్కింగ్‌కు మాత్రం అనుమతించడం లేదు. దీని కారణంగా అపార్టుమెంట్లకు వచ్చేవారు తమ వాహనాలను అపార్టుమెంట్ల బయటే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఇక సినిమా హాళ్లు, మల్టీపెక్స్‌ల వద్ద పార్కింగ్ కోసం భారీగా ఫీజులను వసూలు చేస్తుండటంతో వాటి నుండి తప్పించుకునేందుకు వాహనదారులు వారి వాహనాలను నగరంలోని పలు రహదారులు, వీధుల్లో పార్కింగ్ చేస్తున్నారు. అనుమతులు లేని ప్రదేశంలో, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి వెళ్తుండటంతో ఎన్నో సమయంలో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతోంది.అపార్టుమెంట్లు, గృహ సముదాయాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, బహళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్న లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్టుమెంట్‌లోని 10శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. కాని ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. 1994లో ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్డింగ్స్ నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 2ప్లాట్లకు ఒకటి చొప్పన కనీసం కార్ పార్కింగ్ ఉండాలి. వాణిజ్య, వ్యాపార కాంప్లెక్స్‌లో వాహన పార్కింగ్ కోసం 25శాతం స్థలం కేటాయించాలి. అయితే ఇండిపెండెంట్ ఇళ్లకు మాత్రం పార్కింగ్ నిబంధనలు వర్తించవు. అయితే 2006లో వచ్చిన బిల్డింగ్ నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం నివాస సముదాయాలకు పార్కింగ్‌కు 33శాతం స్థలాన్ని కేటాయించాలి. వాణిజ్య సముదాయాలు, వాటి ముందు 44శాతం పార్కింగ్‌కు కేటాయించాలి. మాల్స్, మల్టీపెక్స్‌లు, సినిమాహాళ్లలో పార్కింగ్‌కు పెద్దపీట వేసి 66 శాతం స్థలం కేటాయించాల్సి ఉంటుంది. పార్కింగ్ కోసం సరైన ప్రదేశాలను నిర్దేశించకుండా వాహనలకు జరిమానాలు వేసి ముక్కుపిండి మరీ పోలీసులు వసూలు చేస్తున్నారని వాహనదారులు లబోదిబో మంటున్నారు. నగరంలోని అతికొద్ది ప్రాంతాల్లో ఎర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో కొంచెం సమయానికి కూడా అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రహదారుల వెంట పార్కింగ్ కోసం స్థలాలను చూపించకుండా చలాన్లతో పోలీసులు ఆదాయాన్ని పెంచుకుంటున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.