కాకినాడ, జూన్ 5 (way2newstv.com):
జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చేలా గోదావరి జలాలతోపాటు పంచాయతీల ద్వారా ఇంటింటా కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పనులకు గాను రూ.2,400 కోట్ల నిధుల కోసం దస్త్రాలను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జలధార’ పథకంలో భాగంగా జిల్లాకు మొదటి విడత నిధులు కేటాయించారు. జిల్లాలో భూగర్భ జలాలు నానాటికి తీసికట్టుగానే మారుతుండడంతో పలు ప్రాంతాల్లో తాగునీటికి కటకటలాడుతున్నారు.మెట్ట ప్రాంతంలోని రంగంపేట, వడిశలేరు, తొండంగి, సముద్రతీర ప్రాంతాలు అమలాపురం, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, ..మిగతా 7లోఅంతర్వేది, రాజోలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని రంపచోడవరం, చింతూరు తదితర ప్రాంతాల్లో తాగునీటికి పడుతున్న అవస్థలను గుర్తించి ఇక్కడ మొదటి దశలోనే పనులను ముమ్మరం చేస్తున్నారు. సీపీడబ్ల్యూఎస్ పథకంలో సముద్రతీర ప్రాంతాలకు గోదావరి జలాలు అందిస్తారు. మైదాన ప్రాంతాల్లో నివాసాలకు పంచాయతీ రక్షితనీటి పథకాల నుంచి ‘జలధార’ చేరుతుంది. సముద్రతీర ప్రాంతాలకు గోదావరి జలాలను పైపులైన్ వేసి తీసుకొస్తారు. అక్కడ అందుబాటులో ఉన్న పెద్ద ట్యాంకులకు అనుసంధానం చేస్తారు. పెద్ద ట్యాంకులు లేకపోతే అక్కడ లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి ప్రతి గ్రామానికి నీటిని సరఫరా చేస్తారు. పైపులైన్ లేని గ్రామాల్లో కొత్తగా వాటిని నిర్మిస్తారు.
జలధార (తూర్పుగోదావరి)
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జలధార పథకం పనులు జిల్లాకు వచ్చేసరికి ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం జిల్లా అంతా 15 బృందాలు రూట్ సర్వే చేస్తున్నారు. భూమి లోపల నీటి లోతు ఎంత, మట్టి నమూనాలు, ప్రస్తుతం ఉన్న కొళాయిలు, ఎంతమందికి అవసరం, పైపులైన్ డిజైన్ తదితర వాటిని పూర్తి చేస్తున్నారు. అవసరమైన నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఒక దశలో గోదావరి తీర ప్రాంతంలోని రాజమహేంద్రవరం గ్రామీణం, సీతానగరం ప్రాంతాలను సీపీడబ్ల్యూఎస్ పథకంలో చేర్చాలని నిర్ణయించారు. సీతానగరంలో ఇప్పటికే రూ. మూడు కోట్ల నిధులతో గోదావరి జలాలను సరఫరా చేసేలా పథకం పనులు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం గ్రామీణంలో కూడా రక్షితనీటి పథకాల ట్యాంకులతోనే జలధారను చేర్చారు. ఏక గ్రామంలో ఏడాది కాలపరిమితి, రెడు మూడు గ్రామాలున్న చోట్ల పనులు రెండేళ్ల కాలపరిమితిగా ఉన్నాయి. సీపీడబ్ల్యూఎస్ పథకంలో చేసే పనులకు కాల పరిమితిని రెండేళ్లకు ఇచ్చారు. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచి పనులు చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి పంచాయతీలో శివారు ఆవాసాలను జలధార పథకంలో తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ కొళాయిల కనెక్షన్లు కొద్దిమందికి ఉంటే మిగతావారికి కొళాయిలు ఇచ్చేలా పైపులైన్ రూపొందిస్తున్నారు. వారం వ్యవధిలోనే నూరుశాతం సర్వే పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. నీటి నాణ్యత, మట్టి నమూనాలు ఇప్పటికే ప్రయోగశాలలకు చేరాయి. వాటి నివేదికలను అనుసరించి జూన్ మొదటి వారంలో ఏ ప్రాంతాల్లో పనులు చేపట్టాలనే దానిపై అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రధానంగా సముద్రతీర ప్రాంతాల్లో గోదావరి జలాలను అందించే సీపీడబ్ల్యూఎస్ పథకం పనులు ముందుగా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి వరద నీటి ప్రవాహం వల్ల పనులు ముందుకు సాగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జూన్, జులైలో అయితే చాలావరకు పనులు పూర్తిచేసి పైపులైన్ గోదావరి నదీగర్భం నుంచి బయటకు తీసుకొచ్చే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.