అందరి కల అదే.. (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందరి కల అదే.. (గుంటూరు)

గుంటూరు, జూన్ 5 (way2newstv.com): 
ఎవరు ఎలా చెప్పినా అందరి ఆలోచనా ఒక్కటే. పసుపు రైతుకు గిట్టుబాటు ధర తీసుకురావాలి. దుగ్గిరాల పసుపునకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాలి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పసుపు రైతులు నామినేషన్లు వేసినా, గత నెలలో దుగ్గిరాలలో జరిగిన రైతు సమావేశంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడినా అందరి అభిప్రాయం ఒక్కటే. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పరిశోధనా కేంద్రం ఏర్పాటు  చేయాలనేది. వైద్యపరంగా, కాస్మోటిక్స్‌లోనూ పసుపు వినియోగం చాలా ఎక్కువ. వంటల్లో వాడడం తక్కువ. అందుకే కాస్మోటిక్స్‌ ఎక్కువగా వినియోగించే అరబ్‌ దేశాలకు పసుపు ఎగుమతి ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా క్యాన్సర్‌ వంటి రోగాల నివారణిగా పసుపు ఉపయోగపడుతుందనేది పరిశోధనల ద్వారా తెలిసిన అంశం.పసుపులో కడప, టేకూరుపేట, సేలం, మైదుకూరు, ప్రతిభ, ప్రభ తదితర రకాలు ఉన్నాయి. పసుపులో కర్కుమిన్‌, నూనె, 2మెగా 3ఫాటీఆమ్లాలు తదితర పదార్థాలు ఉంటాయి. ఏ రకంలో కర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి పసుపు నాణ్యతను నిర్ధారిస్తారు. మహారాష్ట్ర సాంగ్లీలోని యార్డులో అమ్మకానికి వస్తున్న పసుపు రకం ధర క్వింటాలు రూ. 10 వేలు దాటుతోంది. అదే ఇక్కడ క్వింటా రూ. 6000 దాటాలంటే గగనం అవుతోంది. 

అందరి కల అదే.. (గుంటూరు)
అదే పరిశోధనా కేంద్రం ఉంటే విత్తనంపై పరీక్ష చేయచ్చు. నాణ్యమైన రకాలు ఉత్పత్తి చేయచ్చు. ఇక్కడ పసుపు సాగుకు ఎక్కువ ఖర్చువుతోంది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. దీంతో పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఉంటే నాణ్యమైన రకాల్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. తద్వారా రైతుకు ఆదాయమూ లభిస్తుంది.దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలనేది మొదటి నుంచీ వినవస్తున్న వాదన. దాదాపు 55 ఏళ్ల క్రితం దుగ్గిరాల మండలం పెదపాలెంలో పరిశోధనా కేంద్రం ఉండేది. ఆ ప్రాంతంలో పండే పసుపు రకాల్ని ఇక్కడకు తెచ్చి పరీక్షలు చేసేవారు. సాధారణ రకాలతో పాటు దుగ్గిరాలకే ప్రాధాన్యత ఉన్న దేశవాళి రకం అప్పట్లో ఉండేది. ఈ రకంతో పాటు పరిశోధనా కేంద్రం కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. దుగ్గిరాలలో ప్రయోగశాల ఏర్పాటుకు కొన్ని పరికరాలు తీసుకువచ్చారు. కొందరు సిబ్బందిని నియమించారు. యార్డుకు వస్తున్న పసుపుపై కొన్ని పరీక్షలు మాత్రం చేస్తున్నారు. అసలైన కర్కుమిన్‌ శాతం కనుగొనే యంత్రం లేదు. దాదాపు ఏడాదిగా అధికారులు వస్తుందని చెబుతున్నా నేటికీ రాలేదు. దుగ్గిరాలలో ప్రత్యేకించి భవనాలు నిర్మించాల్సిన పనిలేదు. కొత్త యార్డులో కొన్ని భవనాలు ఉన్నాయి.నేరుగా పసుపు పరిశోధనా కేంద్రాలు అని కాకుండా ‘ఆలిండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చి ప్రాజెక్టు ఆన్‌ స్పైసెస్‌(ఏఐసీఆర్‌పీ స్పైసెస్‌) పేరిట కేంద్రాలు నడుస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో కొన్ని చోట్ల ధనియాలు, మెంతులు, వాము, ఆవాలు ఇలా పరిశోధనలు చేస్తుంటే, మరి కొన్ని చోట్ల పసుపు, అల్లం వంటి ఒకే జాతికి చెందినవి పరిశోధనలు చేస్తారు. పసుపుపై పరిశోధనలు చేసే కేంద్రాలు దేశం మొత్తం మీద 14 ఉన్నాయి. ఒకప్పుడు దుగ్గిరాల మండలం పెదపాలెంలో ఉందంటే అప్పటి రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకువచ్చారు. తర్వాత కాలంలో దేశంలో పోటీ పెరగడంతో దుగ్గిరాలకు పరిశోధనా కేంద్రం రాలేదు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో గట్టిగా పలుకుబడి ఉంటే తప్ప కేంద్రం వచ్చే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొనటం గమనార్హం