ఢమాల్ మంటున్న నిమ్మ ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఢమాల్ మంటున్న నిమ్మ ధరలు


నెల్లూరు, జూన్ 19, (way2newstv.com)
నిమ్మకాయల ధరలు నానాటికి పతనమవుతున్నాయి. గిట్టుబాటు ధరలేక గూడూరు డివిజన్‌లోని నిమ్మరైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిమ్మ ధరలు పూర్తిగా పడిపోయి రైతులకు లాభాలు అందక ఆందోళనకు గురవుతున్నారు. ఒకనాడు లాభసాటిగా సాగి రైతులను ఆదుకున్న నిమ్మసాగు కొంతకాలం విరామంలాగా అవాంతరం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పంటను గూడూరు రైతులు కొనసాగిస్తున్నారు. మరికొందరు రైతులు జామాయిల్, సుబాబుల్ తదతర సాగుకు మొగ్గు చూపుతున్నారు. నిమ్మసాగు చేస్తున్న రైతులు భవిష్యత్తుపై కొంత ఆశలు పెట్టుకుని కొనసాగిస్తున్నా ఆశలు ఆవిరైపోతున్నాయే తప్ప ఆశించిన ప్రయోజనం కానరావడం లేదని వాపోతున్నారు. దీంతో నిమ్మ వ్యాపారం కూడా సీజనల్ వ్యాపారంగా క్రమేణా మారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిమ్మ రైతులు సుఖంగా ఉన్నారంటే సంబంధిత వ్యాపారుల పరిస్థితి కూడా కళకళలాడుతున్నట్లే. కానీ ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతుంది. నిమ్మతోటల్లో కాయల దిగుబడి ఎక్కువగా ఉన్నపుడు మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. 

ఢమాల్ మంటున్న నిమ్మ ధరలు 

నిమ్మకాయల దిగుబడి లేనపుడు మార్కెట్‌లో ఊహించని విధంగా ధరలు పెరగటం సహజంగా మారింది. వీటన్నింటికి మించి వర్షాభావంతో నిమ్మచెట్లకు ఉన్న పూత, పిందెలు సైతం ఎండిపోతున్నాయి. ఫలితంగా ఎండిపోయిన నిమ్మచెట్లను వంటచెరుకుగా వాడుకోవాల్సి వస్తోందని రైతులు కంటతడి పెడుతున్నారు. ఈ వ్యవసాయం లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వేసవిలో నిమ్మ ధరలు బాగా పలికాయి. అంతంతమాత్రంగా కాసిన నిమ్మకాయల మూలంగా కొంతమంది రైతులు మాత్రమే లాభపడ్డారు. ఇటీవల తేలికపాటి చినుకులు కురిసి కాపు బాగా కాయడంతో మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా పోయింది. ప్రస్తుతం వీస్తున్న ఈదురుగాలులు మూలంగా నిమ్మపంట రాలిపోతోందని రైతులు వాపోతున్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక బస్తా ధర సుమారు ఐదువేల నుంచి ఏడువేల రూపాయల వరకు పలకగా, ప్రస్తుతం బస్తా నిమ్మకాయలకు వేయి నుంచి 1800 రూపాయలు మాత్రమే లభిస్తోంది. రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుని బస్తా నిమ్మకాయలు కోయాలంటే కూలీలు, ఆటో బాడుగలు పోను కేవలం మిగిలేది కూడా రైతు ఖర్చుల కింద సరిపోతుంది. దీంతో నిమ్మరైతులు తీవ్రనష్టానికి గురవుతున్నారు. గూడూరు నుంచి నిమ్మకాయలను ఎక్కువగా ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతి చేయడం ఆనవాయితీ. కానీ కొంతకాలంగా అక్కడ చలి తీవ్రంగా ఉండటంతో కాయలు కొనేవారు లేక ఎగుమతులు కూడా అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఎగుమతులు జరిగినా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇటు రైతులు, అటు వ్యాపారులు లాభసాటిగా లేని కారణంగా వ్యాపారాన్ని కొనసాగించడం లేదు. గతంలో గూడూరు నుంచి ఢిల్లీకి ఎక్కువగా నిమ్మకాయల ఎగుమతి భారీగా జరిగి అనేకమంది రైతులు, వ్యాపారాలు లక్షాధికారులైన సంఘటనలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో నిమ్మరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉండగా అలాంటి దాఖలాలు కనిపించటం లేదు. నిమ్మ రైతులు పండించే కాయలకు సరైన ధర లభించాలంటే కాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం రైతులకు సదుపాయం కల్పించాల్సి ఉంది. మార్కెట్ విక్రయాల అనంతరం మిగిలిన నిమ్మకాయలను లోకల్ మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలుగా నిమ్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలాంటి సదుపాయాలు లేని కారణంగా నిమ్మ రైతులు నష్టాల ఊబిలో చిక్కుకుని ఇబ్బందులుపడుతున్నారు. వెంకటగిరి మండలం పెట్లూరులో నిమ్మ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.