బంటుమిల్లి, జూన్ 5(way2newstv.com):
పెదలంక డ్రెయిన్ ద్వారా ఉప్పు నీరు పొంగి పొర్లి రైతులను ముంచుతోంది. పదేళ్లుగా ఈ సమస్యను రైతులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్య వేసవి కాలం మే నెలలో రెట్టింపవుతోంది. ప్రస్తతం ఉప్పుటేరు, దాని అనుబంధ డ్రెయిన్‌లలో ఉప్పునీరు పొంగి పొర్లుతోంది. దీంతో సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతోంది. కొత్త ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరిస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ సారధ్యంలో ఈ సమస్య పరిష్కార మవుతుందన్న ఆశతో రైతులు వున్నారు.కొల్లేరు నుంచి చినగొల్లపాలెం వరకు గల అతిపెద్ద డ్రెయిన్... అనవసరపు నీటిని, భారీ వర్షాల సమయంలో డ్రెయిన్లలోకి వచ్చిన జలాలను సముద్రంలోకి చేరవేస్తుంటుంది. పూడికపోవడం, వెడల్పు తగ్గిపోవడం తదితర కారణాలతో ఉప్పునీరు వేగంగా సమద్రంలోకి వెళ్లడం లేదని భావించిన అప్పటి ప్రభుత్వం గరిశపూడి మీదుగా కొత్తకాల్వనుతవ్వించింది.
ఉప్పుతో ముప్పు (కృష్ణాజిల్లా)
ఆ సమయంలో ఉప్పుటేరులో కలవాల్సిన పెదలంక డ్రెయిన్ నీటిని కొత్త కాల్వలోకి మళ్లించారు. కొత్త కాల్వ తవ్విన తరువాత ఉప్పుటేరు ముఖద్వారం పూడిక పోవడం ప్రారంభించింది. కొత్తకాల్వపై ఒత్తిడి పెరగడంతో అనుబంధ పెదలంక డ్రెయిన్‌లోకి ఉప్పునీటి ముప్పు అధికమయ్యింది. ఉప్పుటేరు ముఖద్వారాన్ని డ్రెడ్జర్‌లతో పూడిక తీయించినా ఫలితం లేకపోయింది.సముద్ర పాటు-పోటు ప్రభావం ఉప్పుటేరు, కొత్తకాల్వపై పడుతుంది. పాటు సమయంలో నీరు సముద్రంలోకి చేరుతుండగా పోటు సమయంలో సముద్రపు ఉప్పు నీరు కాలువలోకి ప్రవేశిస్తుంది. ఈ ఉప్పునీరు ఎగదన్ని చిన్నచిన్న డ్రెయిన్‌లలోకి, తద్వారా పొలాల్లోకి చేరి భూములను ఉప్పుమయం చేస్తోంది. ఈ సమస్యను ముందే గమనించిన ప్రభత్వం పోటు సమయంలో కొత్త కాల్వ ద్వారా ఉప్పునీరు గ్రామాలకు చేరకుండా, భూములకు నష్టం జరక్కుండా గరిశపూడి వద్ద అండర్ టన్నెల్ నిర్మించి, షట్టర్లు ఏర్పాటు చేసింది. పోటు సమయంలో షట్టర్లను కిందకు దింపితే ఉప్పునీరు కాలువ గుండా వెనుకకు చేరదు. దీంతో ఉప్పునీటి సమస్యకు అడ్డుకట్ట పడింది. కొంత కాలానికి షట్టర్లు పాడైపోవటంతో ఉప్పు నీటి సమస్య తిరిగి ప్రారంభమయ్యింది. ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పటి ఎమ్మెల్యే వేదవ్యాస్ మళ్లీ షట్టర్లను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు మరోసారి షట్టర్లు పాడైపోయాయి. తిరిగి ఉప్పు నీటి సమస్య మొదలయింది.పెదలంక డ్రెయిన్‌లోకి ఉప్పునీరు చేరకుండా గరిశపూడి టన్నెల్ వద్ద ఆటోమేటిక్ షట్టర్లను ఏర్పాటు చేయాలని రైతులు ఎప్పటినుంచో విన్నవించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది. ఇక్కడ షట్టర్లు ఏర్పాటు చేస్తే 25 వేల ఎకరాలకు ఉప్పు నీటి ముప్పు సమస్య ఉండదని, ఫలితంగా కోట్లాది రూపాయల చేప, రొయ్యల ఉత్పత్తి సాధ్యమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. కలిదిండి, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి మండలాల రైతులకు ఈ షట్టర్ల వల్ల ఎంతో లాభంచేకూరుతుందని మొరపెట్టుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గట్టిగా కృషి చేయాలని కోరుతున్నారు.
Tags:
News