జిల్లాల పెంపునకు కొత్త అడ్డంకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లాల పెంపునకు కొత్త అడ్డంకులు


ఏలూరు, జూన్ 3, (way2newstv.com)
ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన జగన్ వరుసగా తాను ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన అమలు పర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది జిల్లాల పెరుగుదల. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల సంఖ్యను పెంచుతానని మాట ఇచ్చారు. తెలంగాణలో అక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలను పెంచారు. తాను కూడా జిల్లాలను పెంచితే పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని జగన్ అనేక సభల్లో చెప్పారు.ఈ మేరకు ఆయన కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలున్నాయి. వీటిని 25కు పెంచాలన్నది జగన్ ఆలోచన. జిల్లాల పెంపుపై అధ్యయనాన్ని ఇప్పటికే ఒక అధికారికి జగన్ అప్పగించినట్లు చెబుతున్నారు. జగన్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని పాదయాత్రలో మాట ఇచ్చారు. 


జిల్లాల పెంపునకు కొత్త అడ్డంకులు
అయితే ఇందుకు సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రాలను జిల్లాలను చేస్తే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలు మారే అవకాశముంది. ప్రకాశం జిల్లా తీసుకుంటే నెల్లూరు, బాపట్ల, పార్లమెంటు పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.అలాగే రాజంపేట పార్లమెంటు పరిధిలో కడప, చిత్తూరుజిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాలున్నాయి. అయితే ఇది సాంకేతికంగా సాధ్యం కాదని అధికారులు జగన్ కు స్పష్టం చేసినట్లుచెబుతున్నారు. ఇలా చేస్తే రెవెన్యూ రికార్డుల మొత్తాన్ని ఒక జిల్లా నుంచిమరొక జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. దీంతో దీనిపై అధ్యయనం చేసే బాధ్యతను జగన్ ఒక అధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది. భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా జగన్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబునాయుడు రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలనుకుని వెనక్కు తగ్గారు. ఇందుకు కారణాలుకూడా లేకపోలేదు. కొత్త రాష్ట్రం కావడంతో తగినంతమంది అధికారులు, సిబ్బంది లేరు. ఐఏఎస్, ఐపీఎస్ ల కొరత ఉంది. జిల్లాల సంఖ్య పెరిగితే అందుకు సరిపోయిన సంఖ్యలో అధికారులు లేరు. దీనిని అధిగమించేందుకు జగన్ తొలుత కసరత్తులు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద జిల్లాల సంఖ్యను కొద్దిరోజుల్లోనే జగన్ ప్రభుత్వం పెంచే అవకాశముందన్నది సచివాలయం వర్గాల టాక్.