ఏడో తేదీ శాసనసభా పక్ష సమావేశంలోనే కేబినెట్ పేర్లు


విజయవాడ, జూన్ 3, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు రాబోయే ఐదేళ్లలో ఎలాంటి సమస్యలు ఉంటాయో కానీ, ప్రస్తుతం మాత్రం ఆయన ముందున్న ప్రధాన సమస్య కేబినెట్. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి సునామీలా వీచింది. దీంతో జగన్ మోహన్ రెడ్డితో కలిపి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేదే జగన్ ఎదుట ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సవాల్. నిబంధనల ప్రకారం.. 25 మందిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చు. మళ్లీ అందులో జిల్లాలకు ప్రాధాన్యం కల్పించారు. సామాజికవర్గాలు అసంతృప్తికి గురికాకుండా చూసుకోవాలి. గతంలో మాట ఇచ్చిన వారికి చోటు కల్పించాలి. ఇవి కాకుండా జగన్ కుటుంబం నుంచి కూడా కొన్ని ‘రికమండేషన్లు’ కూడా ఉండే అవకాశం ఉంది. 


ఏడో తేదీ శాసనసభా పక్ష సమావేశంలోనే  కేబినెట్ పేర్లు
కొందరు ఎమ్మెల్సీలు కూడా రేస్‌లో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాల్లో జిల్లాకు ఇద్దరు చొప్పున కేటాయించేస్తే సమస్య తీరిపోతుంది. అయితే, అందులో ఎవరిని తీసుకోవాలనే అంశం జగన్ విజ్ఞత, ఆయన భవిష్యత్ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కేబినెట్ అనగానే తాను అనుకున్న వారికి ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణస్వీకారానికి రెడీ అవ్వమని చెబుతూ ఉంటారు. గత ప్రభుత్వాల్లోనూ ఇలాంటివే జరిగాయి. అయితే, ఇప్పుడు కూడా జగన్ తన టీమ్‌ను రెడీ చేసుకున్నా.. ఆ విషయం అందరితోపాటే వారికి కూడా చెప్పేస్తే బెటర్ అనే అభిప్రాయంలో జగన్ ఉన్నారు.ఈనెల 7న వైసీపీ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అదే రోజు అందరి ముందు జగన్ మోహన్ రెడ్డి తన డ్రీమ్ కేబినెట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అసంతృప్తి ఏదైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. కేబినెట్ పదవి ఆశించి భంగపడే వారికి కూడా ఆ వేదిక మీదే కొన్ని హామీలు ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
Previous Post Next Post