అంతా మరిచారా..? (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతా మరిచారా..? (అనంతపురం)

అనంతపురం, జూన్ 15  (way2newstv.com):

‘మన అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ కార్యక్రమం ఈనెల ఒకటిన మొదలైంది. ఇవాళ్టితో ముగుస్తుంది. ఈలోపు 3+ వయసు కల్గిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో, 5+ వయసు కల్గిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే ముఖ్యోద్దేశం. ఇప్పటికే  సమయం మించిపోయింది. ఎంత మంది పిల్లలు ఉన్నారో స్పష్టమైన గణాంకాలు లేవు. ఐసీడీఎస్‌ సీడీపీఓ, సూపర్‌వైజర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. రానున్న పది రోజుల్లో ఎంత మందిని చేరుస్తారోనన్నది అనుమానమే. జిల్లా కేంద్రం నుంచి క్షేత్ర స్థాయి దాకా దీని గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అక్కడక్కడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో చర్యలకు ఉపక్రమించలేదు.


అంతా మరిచారా..? (అనంతపురం)
జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 5126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం లబ్ధిపొందుతున్న 5+ పిల్లలు ఎంత మంది ఉన్నారో సేకరించాల్సి ఉందంటూ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఓ అంచనా ప్రకారం దాదాపు 25 వేల మంది దాకా ఉంటారు. వీరిని సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించాలి. ఇది అంగన్‌వాడీ కార్యకర్తల బాధ్యత. ఇదే క్రమంలో 3+ వయసు కల్గిన పిల్లలను అంగన్‌వాడీల్లో నమోదు చేయించాలి. ఈ తరహా పిల్లలు దాదాపు 80 వేలు దాకా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంటింటా సర్వేలో ఈ సంఖ్య తేల్చినా.. ఐసీడీఎస్‌ యంత్రాంగం వద్ద వివరాలేవీ లేవు.గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టారు. రెండేళ్ల కిందటే దీన్ని అమలు చేస్తున్నా ఆశించిన ప్రయోజనాలు రాలేదు. పట్టణ, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీలను విలీనం చేశారు. అయినా సరే ఏమాత్రం ఫలితం ఒనగూరలేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి కోర్సుల పేరుతో పిల్లలను చేర్పించారు. ఇదే క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి పుస్తకాలను కూడా సరఫరా చేశారు. ఇవన్నీ కేంద్రాల్లో మూలన పడేశారు. ఈ విద్యా సంవత్సరమైనా ప్రణాళిక ప్రకారం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.