టిడిపికి చుక్కలు చూపిస్తున్న వైసిపి సర్కార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టిడిపికి చుక్కలు చూపిస్తున్న వైసిపి సర్కార్


విజయవాడ, జూన్ 20, (way2newstv.com)
మాకిచ్చిన లెక్క సరిచేస్తామన్న ధోరణిలో వైసిపి సర్కార్ టిడిపికి చుక్కలు చూపించేస్తుంది. అసలే అధికారం పోయి దేశవ్యాప్తంగా అవమానాలు పాలైతే వైసిపి నిత్యం ఇస్తున్న టార్చర్ కి తమ్ముళ్ళే కాదు అధినేత చంద్రబాబు నాయుడు సైతం అల్లాడిపోతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న తరహాలోనే వైసిపి వ్యవహారం సాగిస్తూ ఉండటంతో ఎవరికి తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియని తమ్ముళ్ళు స్పీకర్ ముందు పంచాయితీకి సిద్ధం అయ్యారు. ఇంతకీ వీరి గోల జనం కోసం కాదు. మాకు మంచి చాంబర్ కేటాయించమని వేడుకోలు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కి అడుగడుగునా అవమానాలు చవిచూపించడమే కాదు చినుకుపడితే ఆయన ఛాంబర్ నీటమునిగేలా చేసిన తీరు ఇప్పుడు అధికారం పోయిన టిడిపికి ఎదురైంది.స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గరకు టిడిపి ఎమ్యెల్యేలు అంతా తీవ్ర ఆందోళనతో వెళ్లారు. 


టిడిపికి చుక్కలు చూపిస్తున్న వైసిపి సర్కార్
మా అధినేత ఛాంబర్ ఎక్కడో డిసైడ్ చేయాలంటూ వారు వేడుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ ను విపక్ష నేత చంద్రబాబు నాయుడు కు అసెంబ్లీలో కేటాయింపు జరిగింది. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ బాధ్యతల్లో ఎవరు లేకపోవడంతో టిడిపి బాగానే అక్కడ సర్దుకుంది. అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ గా బాపట్ల ఎమ్యెల్యే కోన రఘుపతి తన ఛాంబర్ కి రేపోమాపో అధికారికంగా చేరుకోవడానికి సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో బాబు తన దుకాణం మళ్ళీ మార్చుకోవాలి. దాంతో ఇటు శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిసి 50 మందికి పైగా ఉన్నందున పెద్ద చాంబర్ కేటాయించాలంటూ టిడిపి ఎమ్యెల్యేలు స్పీకర్ కు విన్నవించారు. దీనిపై అధికారులతో మాట్లాడి చెబుతానంటూ స్పీకర్ వారిని పంపేయడంతో టీడీపీలో ఆందోళన చుట్టుముట్టింది. కోరిన ఛాంబర్ ఇవ్వని పక్షంలో ఆందోళన చేయాలని పసుపుదండు సిద్ధం అవుతుంది.గత ఎన్నికల్లో 67 మంది శాసన సభ్యులు ఎన్నికైన వైసిపికి అతిచిన్న ఛాంబర్ కేటాయించారని అందులోనే అందరం సర్దుకున్న విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేస్తుంది. ప్రజలకు ఏ రకంగా సేవలు చేయాలో ఆలోచించాలి కానీ చాంబర్ల కోసం గొడవేమిటి అంటుంది వైసిపి. చిన్న ఛాంబర్ ఇచ్చినా ప్రజా పోరాటాలతో జనంలో నిలిచి అధికారంలోకి వచ్చామని చాంబర్ల కోసం ఇలా దేవులాడుకోలేదంటుంది అధికారపక్షం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కి ఛాంబర్ ఎలాంటిది అధికారపార్టీ కేటాయిస్తుంది అన్నది అసెంబ్లీ వర్గాల్లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ రేపుతోంది