ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసిన… గంటల్లోనే.. అధికారయంత్రాంగం ప్రక్షాళన ప్రారంభమయింది. ముందస్తుగా కసరత్తు చేసి రెడీగా పెట్టుకున్నట్లుగా.. వరుసగా.. ఆదేశాలు వచ్చాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు… చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్‌ను తమ చేతులతో నడిపిన వారందరికీ… మొట్టమొదటగా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత డీజీపీ ఆర్పీఠాకూర్ సంగతి తేల్చారు. ఇక ఎన్నికల సమయంలో అదే పనిగా ఆరోపణలు చేసిన ఏసీపీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎందుకు వదులుతారు. ఆయననూ ఎక్కడికో చెప్పకుండా బదిలీ చేశారు. ఇవి మరింత దూకుడుగా ముందు ముందు ఉండనున్నాయి. అచ్చంగా జెమిని సినిమాలో వెంకటేష్‌ను సంస్కరించే పోలీసు అధికారిలా… ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పరిస్థితి మారింది. నిన్నటి వరకూ ఆయన పోలీస్ బాస్. టీడీపీకి అనుకూలంగా పని చేశారో లేదో కానీ.. వైసీపీ నేతలు మాత్రం.. ఆయనపై పీకలదాకా కోపం పెట్టుకున్నారు.
సీఎంవోలో జగన్ మార్క్
ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే… ఆయన పై వైసీపీ నేతలు పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి… హైదరాబాద్ లోని ఆయన ఇంటిని కూడా కూలగొట్టించారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశించడం… అత్యాశే కానీ.. మరీ.. ప్రింటింగ్, స్టేషనరీ లెక్కలు చూసుకోమని చెప్పి పంపించడం మాత్రం.. కాస్త కటువైన నిర్ణయమే. కానీ జగన్ మాత్రం.. అదే చేశారు. ఏబీ వెంకటేశ్వరరావును ఎక్కడకు పంపిస్తారో..? చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ డీజీగా ఓ వెలుగు వెలిగిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఈసీ ఆగ్రహానికి బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనకు .. ఏసీబీ డీజీ పోస్ట్ ఇచ్చారు. కానీ.. ఉన్న పళంగా ఆయనను బదిలీ చేసేసి… జీఏడీలో రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆయన స్థానంలో కుమార్ బిశ్వజిత్‌కు చాన్సిచ్చారు. ప్రస్తుతం ఈయన ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. రేపోమాపో… స్టీఫెన్ రవీంద్ర వస్తారు కాబట్టి… ఇలా.. కవర్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై… కూడా.. వైసీపీ నేతలకు పీకల దాకా కోపం ఉంది. ఆయనకు అత్యంత అప్రాధాన్య శాఖ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న అభిప్రాయం.. ఇప్పటికే పోలీసు వర్గాల్లో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన ప్రాధాన్యం కల్పించిన అధికారులెవ్వరూ.. ఈ సారి.. ప్రభుత్వంలో ప్రముఖంగా ఉండే అవకాశాలు లేవు. సీఎంవోలో మొత్తాన్ని అప్పటికప్పుడు బదిలీ చేయడమే కారణం. సీఎంవోలోకి.. కొంత మంది అధికారుల్ని తీసుకున్నారు. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలపై దృష్టి పెట్టనున్నారు. మొత్తంగా చూస్తే… అధికారవర్గాల్లో ఓ ప్రక్షాళన జరుగుతోంది. ప్రాధాన్యత కోల్పోయిన అధికారులు.. అసహనానికి గురి కాకుండా ఉండరు. ప్రాధాన్యత దక్కిన వారు సంతోషపడకుండా ఉండలేరు. ఈ పరిస్థితి… ఉన్నతాధికారుల మధ్య విభజనకు కారణం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.