ఉపాధి పెంపే లక్ష్యంగా ఐకార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉపాధి పెంపే లక్ష్యంగా ఐకార్


హైద్రాబాద్, జూన్ 25, (way2newstv.com)
గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పొందేలా యువతీ యువకులకు నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అగ్రి సర్వీసెస్ అండ్ బిజినెస్ బై హార్‌నెస్సింగ్ యూత్ త్రూ అగ్రికల్చర్ స్కిల్స్ (అభ్యాస్) పేరుతో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ఏడాది డిప్లొమా కోర్సును రూపొందించింది. ఏడాది కోర్సు అనంతరం శిక్షణ పొందిన యువతీ యువకులు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో భూసార పరీక్ష కేంద్రాలు, డయగ్నస్టిక్ లేబరేటిస్, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను, విత్తన పరీక్ష ప్రయోగశాలలను నెలకొల్పుకోవడానికి ప్రోత్సహిస్తారు. రైతులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో ఈ కోర్సు ద్వారా 50 వేల మంది నిపుణులను తయారు చేయాలని ఐకార్ నిర్ణయించింది.ఈ మేరకు డిప్లొమా కోర్సుపై సూచనలు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు లేఖ రాసింది. 


ఉపాధి పెంపే లక్ష్యంగా ఐకార్
ఈ నెల 21వ తేదీ నాటికి సూచనలు పంపాలని విన్నవించింది. అలాగే సేంద్రీయ వ్యవసాయం, మొక్కల ఆరోగ్య యాజమాన్యం, సురక్షిత వ్యవసాయ సాగు పద్దతులపై రైతులకు సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీల అవతారం ఎత్తవచ్చు. అందుకోసం అవసరమైన ప్రోత్సాహకం ఇస్తారు. ఆయా రంగాల్లో ఔత్సాహిక అగ్రి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా విద్యార్ధులను తీర్చిదిద్దుతారు.డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు ఈ కోర్సులో ప్రవేశాలకు ప్రత్యేకమైన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఐకార్ ద్వారా స్కాలర్‌షిప్ ఇస్తారు. ఏడాది డిప్లొమా కోర్సుకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఈ కోర్సు రెండు దశల్లో జరుగుతుంది. మొదటి మూడు నెలలు తరగతి గదిలో శిక్షణ ఇస్తారు. వీరికి ఈ మూడు నెలలకు నెలకు రూ. 15 వేల చొప్పున ఫెలోషిప్ ఇస్తారు. ఇక మిగిలిన తొమ్మిది నెలలు గ్రామ పంచాయతీల్లో రైతుల వద్దకు వెళతారు. శిక్షణ కాలంలో వీరిని ఐకార్ ఆధ్వర్యంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కెవికె కేంద్రాలు తదితర సంస్థలకు అనుసంధానం చేస్తారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యాస్ అనే కోర్సుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.ప్రతీ ఎంపికైనా విద్యార్థికి రెండు గ్రామ పంచాయతీలు అప్పగిస్తారు. వీరు రైతులకు వ్యవసాయంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తారు. అలాగే రైతుల అవసరాలను నేరుగా గమనిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో దాదాపు మూడు వేలు మందికి ఈ కోర్సులో అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్రి బిజినెస్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో తమ వంతు భాగస్వాములవుతారు. మరోవైపు యువత వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందుతారని కేంద్రం తెలిపింది.