యాదగిరిగుట్ట సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయని ఏసీబీ ఆఫీసర్లు నిర్ధారించారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో అనేక విషయాలను గుర్తించినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలతో కలిపి సుమారు 30 మంది ఆఫీసర్లు ఈ తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు.ఆఫీసులో పని చేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని ఒకవైపు, ప్రైవేటుగా పని చేస్తున్నవారిని ఒకవైపు, డాక్యుమెంట్రైటర్స్, వారి అసిస్టెంట్లను ఒకవైపు, క్రయ విక్రయాలు చేసే వ్యక్తులను మరోవైపు నిల్చోబెట్టారు. క్రయ విక్రయాలు చేసే వ్యక్తులను ఏం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, డాక్యుమెంట్రుసుం ఎంత ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. డాక్యుమెంట్రైటర్లు, వారి అసిస్టెంట్లను రోజు ఎన్ని డాక్యుమెంట్స్చేయిస్తున్నారనే విషయాలను ప్రశ్నించారు. రైటర్లు, వారి అసిస్టెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని, క్రయ విక్రయాలు చేసే వ్యక్తులను ఆఫీస్ ఆవరణలోకి పంపించారు.జనవరి నెల నుంచి ఇప్పటివరకు సుమారు 16,600 పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు.
యాదగిరిగుట్ట లో భారీగా రిజిస్ట్రేషన్లు
ఆఫీసులో ఉన్న కేవలం నలుగురు సిబ్బందితో ఇన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించారు. రాత్రి మొత్తం డాక్యుమెంట్రైటర్లు, అసిస్టెంట్లను ఆఫీస్ ఆవరణలోనే ఉంచారు.ఏసీబీ ఆఫీసర్లు లోపల తనిఖీలకు వెళ్లిన క్రమంలో ఓ డాక్యుమెంట్రైటర్వద్ద రూ. 1.80 లక్షలు, మరొకరి వద్ద రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కళ్యాణలక్ష్మీ బాండ్లకు సైతం ఉన్న ధర కంటే అధికంగా రూ. 2,500 నుంచి రూ. 3 వేలకుపైగా అందులో ఉన్న ఒక ఉద్యోగి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇళ్లు మార్టిగేజ్ చేయడానికి, జీపీఏకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి.సాధారణంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ డాక్యుమెంట్ను ఆఫీస్ సిబ్బంది సంబంధిత ఓనర్కు అందించాలి. వారు రాకపోతే డాక్యుమెంట్లను ఆఫీస్లోనే ఉంచాలి. ఇలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రైటర్ల వద్ద 135 డాక్యుమెంట్లు లభ్యమవడం పట్ల ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఓనర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేయడానికి రైటర్లు వీటిని వారి వద్ద ఉంచుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో మార్చి నెల నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తయి నెంబర్ వచ్చి కేవలం స్కానింగ్ చేయకుండా 3200 డాక్యుమెంట్లను పెండింగ్లో ఉంచినట్లు గుర్తించారు. వీటితోపాటు 244 డాక్యుమెంట్లు స్కానింగ్ పూర్తి చేసి సంబంధిత ఓనర్లకు ఇవ్వకుండా కార్యాలయ సిబ్బంది వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. రైటర్, కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న డాక్యుమెంట్ఓనర్లకు ఏసీబీ ఆఫీసర్లు ఫోన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పూర్తయింది, ఎంత ఇచ్చారు, డాక్యుమెంట్ను ఎందుకు తీసుకువెళ్లలేదు, దీనికోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేశారా అని ఆరా తీశారు.సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రస్తుతం నలుగురు ప్రభుత్వ సిబ్బంది పని చేస్తుండగా మరో ఏడుగురు ప్రైవేటు సిబ్బంది పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరికి కనీస విద్యార్హత లేదని, సంబంధిత పనిపై ఎలాంటి అవగాహన లేనివారితో ఈ పని చేయిస్తున్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం రాదని, వీరికి జీతాలు ఎవరు ఇస్తున్నారనే కోణంలో విచారణ జరిపారు. వీరితోపాటు డాక్యుమెంట్రైటర్ల వద్ద పనిచేసే 17 మంది అసిస్టెంట్లను గుర్తించారు.
Tags:
telangananews