గుంటూరు, జూన్ 14, (way2newstv.com)
ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన పథకాల నిర్వహణపై అలవిమాలిన నిర్లక్ష్యమే దాహార్తికి కారణం. చెరువుల్లో నీరున్నా శుద్ధి చేసే నిర్మాణాలున్నా నిర్వహణ లేక మూలనపడ్డాయి. నిర్వహణను పొరుగు సేవలకు అప్పగించడంతో కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలపై గ్రామీణులు ఆధారపడాల్సివస్తోంది. కొద్దిపాటి మరమ్మతులతో తాగునీరు సరఫరా చేసే అవకాశమున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. సామాజిక రక్షిత పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్ నిర్మించి పంచాయతీలకు అప్పగిస్తోంది. ఒక్కొక్క దాని కింద 5 నుంచి 15 గ్రామాల వరకు ఉండడంతో ఆయా పంచాయతీ ప్రజలందరూ కలసి కమిటీ వేసుకుని వారి ఆధ్వర్యంలో పథకాన్ని నిర్వహించుకోవాల్సివుంది. 14వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చిన తర్వాత నేరుగా నిధులు పంచాయతీలకు వెళుతున్నాయి. అక్కడి నుంచి నిధులు సమీకరించి నిర్వహణకు వెచ్చించాల్సివుంది. అయితే పంచాయతీలు సకాలంలో స్పందించకపోతుండడంతో ఇప్పటికే జిల్లాలో రూ.3.50 కోట్ల మేర బకాయిపడ్డాయి.
నిర్వహణ లేకపోవడంతో మూలన పడుతున్న నిర్మాణాలు
స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్థిక సంఘం నిధులు వచ్చిన వెంటనే ఇతర పనులకు ఉపయోగించడంతో నిర్వహణకు జమ చేయని పరిస్థితి. దీంతో తలెత్తుతున్న నిధుల కొరత పథకాల నిర్వహణపై ప్రభావం చూపుతోంది.ఏటికేడు అంచనాలు పెంచి ప్రతిపాదనలు పంపడం మినహా ఇప్పటికే వెచ్చించిన సొమ్ముకు జవాబుదారీ లేకపోవడం సమస్య తీవ్రతకు కారణమవుతోంది. చెరువులను శుభ్రంగా ఉంచడంతోపాటు ట్యాంకులు సకాలంలో, సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) సరఫరా చేస్తున్న నీటిని సింహభాగం ప్రజలు గృహావసరాలకు వినియోగిస్తున్నారు. తాగునీటికి మాత్రం ప్రైవేటు ప్లాంట్లు విక్రయించే జలాన్ని కొనుగోలు చేస్తున్నారు.జిల్లాలో 75 సామాజిక రక్షిత నీటి పథకాలుండగా వీటి ద్వారా 521 గ్రామాల్లో ప్రతి వ్యక్తికీ రోజుకు 55 లీటర్లు అందించాలనేది లక్ష్యం. ప్రస్తుతం 412 గ్రామాలకు మాత్రమే ఈ పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తుండగా మిగిలిన 109 గ్రామాలకు ప్రత్యామ్నాయ వనరుల నుంచి నీటిని సరఫరా చేయడం, ట్యాంకర్లతో అందించడం చేస్తున్నారు. చెరువు నిండా నీరున్నా పైపులైను మరమ్మతుకు గురైందని కొన్ని గ్రామాలకు సరఫరా చేయడం లేదు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని కాలయాపన చేస్తూ ట్యాంకర్లను తిప్పుతున్నారు. కొంత సొమ్ముతో పైపులైను బాగు చేయిస్తే రోజువారీగా ట్యాంకర్లు పంపాల్సిన అవసరం లేదని గ్రామస్థులు చెప్పినా సిబ్బంది పట్టించుకోరు. కొన్నిచోట్ల అన్ని ఉన్నా అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేయకపోవడంవల్ల సరఫరా చేయడం లేదు. మొత్తమ్మీద గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీరాజ్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ సమన్వయలోపం పల్లెవాసులకు శాపంగా మారింది.
Tags:
Andrapradeshnews