పచ్చదని కరవు (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పచ్చదని కరవు (ఖమ్మం)

ఖమ్మం, జూన్ 5 (way2newstv.com): 
హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జులై ఒకటి నుంచి ఐదో విడత హరితహారం ప్రారంభం కానుంది. జిల్లాలో ఈ విడతలో 3.3 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకుగాను గ్రామీణాభివృద్ధి, అటవీ, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో 3.95 కోట్ల మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా శాఖల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి విత్తనాలు నాటారు. నాసిరకం విత్తనాలు, ఎండ వేడిమి, సిబ్బందిలో నిబద్ధత కొరవడటం వంటి పలు కారణాలతో అవి నీరసంగా తయారయ్యాయి.జిల్లాలో గతేడాది నాలుగో విడత హరితహారంలో 1.94 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 3.30కోట్లు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం సింగరేణి, ఐటీసీ వంటి సంస్థల సహకారంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2.08 కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 87 లక్షలు, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోటి.. మొత్తం 3.95 కోట్ల మొక్కలు పెంచాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకంలో 483, అటవీశాఖ ఆధ్వర్యంలో 87 మొత్తం 570 నర్సరీలేర్పాటు చేశారు. ఒక్కోదానిలో 20వేల నుంచి లక్ష వరకు మొక్కలు పెంచే ఏర్పాట్లు చేశారు. 

పచ్చదని కరవు (ఖమ్మం)

ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష. ఈ హరితహారంలో ఇంటింటా ఆరు మొక్కలు నాటించాలని నిర్ణయించారు. అంటే ఇళ్లలో ఉపయోగపడేవి ఉండాలి. సర్వే ప్రకారం ప్రజలు కోరుకున్న పండ్లు, పూలు, పలు ఇతర మొక్కలు నర్సరీలో పెంచాలని తీర్మానించారు. దానిమ్మ, బొప్పాయి, నిమ్మ, ఉసిరి, మునగ, జామ, సీతాఫలం, నేరేడు, కరివేపాకు, మందారం, గోరింటాకు వంటి వాటి పెంపకం చేపట్టారు. రైతులకు ఉపయోగపడేలా టేకు, వెదురు, ఎర్రచందనం, మలబారు, వేప పెంపకం చేపట్టాలి. గ్రామాల్లో సమస్యాత్మకంగా మారిన కోతులను బయటకు వెళ్లగొట్టేలా చింత, సీమచింత(గుబ్బ), రేగువంటి చెట్లను రహదారుల వెంట, శివారు ప్రాంతాల్లో నాటాలని నిర్ణయించారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి రెండు నెలల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రతి పంచాయతీ స్థాయిలో ‘గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీ’లను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టారు. పంచాయతీ స్థాయిలో 40, 50వేలు, కొన్ని నిర్దేశిత పంచాయతీల్లో లక్ష మొక్కలు పెంచాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను ఉపాధి హామీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఈ నర్సరీలకు ప్రభుత్వమే వివిధ రకాల విత్తనాలను సరఫరా చేసింది. అనేక నర్సరీల్లో ఈ ఏడాది మొలక శాతం తక్కువగా కనిపించింది. జామ, బొప్పాయి, నేరేడు, కానుగ, దానిమ్మ, చింత విత్తనాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలతో నాటారు. నాసిరకం విత్తనాల కారణంగా మొలవకపోవడం, మొలిచిన కొన్ని రకాలు సున్నితంగా ఉండి ఎండ వేడిమికి చనిపోయి నర్సరీలు వెలవెలబోతున్నాయి. వేర్లు నాటిన టేకు సైతం ఇగుర్లువచ్చి ఎండిపోతున్నాయి. దీంతో స్థానికంగా పలురకాల విత్తనాలు సేకరించి నాటించే ప్రయత్నం చేస్తున్నారు. పలు నర్సరీల్లో మొక్కలకు సరైన రక్షణ కనిపించడంలేదు. ఈ ఏడాది ఎండ, వడగాడ్పు ప్రధాన శత్రువుగా ఉంది. ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించేందుకు సరఫరా చేసిన గ్రీన్‌ షేడ్‌నెట్లు సైతం నాసిరకంగా ఉన్నాయి. పలుమార్లు వీచిన ఈదురు గాలులకు ఇవి చినిగిపోయి మొక్కలకు సక్రమంగా రక్షణ కల్పించలేకపోయాయి. వీటిని మరమ్మతుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వేసవి కారణంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొక్కలకు నీరు అందించాలి. వనసేవకులుగా నియమితులైన కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో నర్సరీల్లో మొక్కలకు నీటి సరఫరా సక్రమంగా అందడంలేదు. అటవీ శాఖ, ఉపాధి హామీ సిబ్బంది కొందరు నర్సరీల నిర్వహణ కూలీలపై వదిలేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో నీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయి.  వాస్తవంగా పంచాయతీ స్థాయిలో నర్సరీలపై ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ వాటివైపు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తిరిగి చూసిన పాపాన పోలేదు. ఈ ఏడాది వరుస ఎన్నికల కారణంగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఉపాధి సిబ్బంది మాత్రమే నర్సరీలను పర్యవేక్షిస్తున్నారు. వనసేవకులుగా నియమితులైన సిబ్బందితో కొత్తగా సర్పంచులకు పొసగటం లేదని తెలుస్తోంది.