వైద్యారోగ్య శాఖ పరంగా క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపుపై పూర్తి స్థాయి స్పష్టత లేకపోవడానికి తోడు ఆరు నెలలుగా గౌరవ వేతనం, పారితోషికాలు నిలిచిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల చోటుచేసుకుంటున్న రాజకీయ పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతపై కమ్ముకుంటున్న నీలి నీడలపై సంఘటిత పోరుకు వ్యూహరచన చేస్తున్నారు. సేవలిలా..: గ్రామీణ,పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ప్రజలకు ఆరోగ్యపరమైన కొన్ని సేవలను చేరువ చేసేక్రమంలో ఆరోగ్య కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న వారు ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చెందుతున్నారు. రమారమి దశాబ్దకాలానికి పైగా కనీస భృతి దక్కకున్నా సేవలందిస్తూ వస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లీబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గర్భిణి, బాలింతలకు వైద్య సేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించేలా చర్యలు తీసుకున్నారు.
తమ పరిధిలో గర్భిణులను గుర్తించి వారిని నిర్దేశిత తేదీల్లో వైద్య పరమైన సేవలు అందుబాటులోకి వచ్చేలా చేయడం, బాలింతలు, చిన్నారులకు సమయానుకూలంగా టీకాలు వేయించడం వంటి చర్యలు చేపట్టాలి. క్రమేపీ ఇతర వైద్యశాఖపరమైన పథకాల నిర్వహణ బాధ్యత కూడా వీరిపైనే పడింది. తొలినాళ్లలో వీరు అందించే సేవలకు అనుగుణంగా పారితోషికం ఇచ్చే పరిస్థితుల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.400 నుంచి రూ.1000 వరకూ రావడం గగనం అయ్యేది. క్రమేపీ వివిధ పథకాల అమలుకు సంబంధించి పారితోషికాలు కూడా పెరగడంతో ఓ పక్క విధులు నిర్వర్తిస్తూ మరో పక్క ఇతర పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందే వెసులుబాటు ఉండేది. ఇటీవల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎక్కువ శాతం కార్యక్రమాల అమల్లో వీరిని భాగస్వాములు చేస్తుండటంతో పనిభారం పెరిగి పూర్తి సమయం విధి నిర్వహణకే సరిపోతోంది. పారితోషికం రూపంలో వచ్చే గరిష్ఠ ఆదాయం రూ.5,600 సరిపోక పస్తులుండాల్సిన కారణాలతో కనీస వేతనం కోసం పలుసార్లు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహించారు. ఎట్టకేలకు గత ప్రభత్వం గడచిన ఆగస్టులో వీరికి గౌరవ వేతనం రూ.3,000గా నిర్ధరించి, గతంలో ఇచ్చే పారితోషికాన్ని కూడా రూ.3,000కు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా గడచిన డిసెంబరు వరకూ వేతానాలు చెల్లిస్తూ వచ్చారు. తమకు గతంలో ఇచ్చేలా పారితోషికాన్ని రూ.5,600 చెల్లించాల్సిందే అంటూ ఆశాలు ఆందోళన చేయడంతో సంఘ నాయకులతో జరిపిన చర్చలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు అంగీకరించారు. ఆయన అంగీకారం తెలిపిన నాటి నుంచి అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఆశాలకు ప్రతి నెలా ఇవ్వాల్సిన వేతనాలు నిలిచిపోయాయి. జిల్లాలో రమారమి 3,000 మందికి పైగా ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం, పారితోషికం కలుపుకొని రూ.8,600 వరకూ చెల్లించాలి. ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో మొత్తం మీద దాదాపు రూ.15 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. తమకు ఆరు నెలల పాటు చెల్లింపులు నిలిపివేస్తే ఎలా బతకాలంటూ ఆశాలు ప్రశ్నిస్తున్నారు.ఆశ కార్యకర్తలకు గౌరవవేతనం రూ.10,000 చెల్లించేలా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నా వేతన పెంపు విషయంలో ఇప్పటి వరకూ పూర్తి స్పష్టత ఇవ్వకపోవడం ఆశాలను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన బకాయిల విషయంలో కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు బకాయిలు చెల్లిస్తారా లేదా అన్నఅనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రకటించిన వేతనం పెంపుపై కూడా చర్చ
సాగుతోంది. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 10,000 గౌరవ వేతనంతో పాటు రూ.5,600 పారితోషకం కలిపి మొత్తం రూ.15,000కు పైగా వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. దీనిపై స్పష్టతతో పాటు, ఆరు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ ఆశా కార్యకర్తలు భావిస్తున్నారు. వేతన పెంపు, పేరుకున్న బకాయిలతో సతమతమవుతున్న తమను రాజకీయ పైరవీలు కలవరపెడుతున్నాయని సంఘ నాయకులు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల అధికారపక్ష నాయకులు ఆశా కార్యకర్తలుగా తమ అనుకూలమైన వారిని నియమించాలనే ఒత్తిళ్లు తీసుకువస్తున్నారన్న
ఆరోపిస్తున్నారు.
Tags:
Andrapradeshnews