ఖరీఫ్ కు కరవు కాటు (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ కు కరవు కాటు (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 19 (way2newstv.com): 
ఖరీఫ్‌ సీజనులో వర్షాలు అనుకూలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సాధారణంగా 5.18 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2.12 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అంటే 40.9 శాతం అన్న మాట. మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా భూములు ఇంకా పడావుగా పడున్నాయి. ఇప్పటికే 90 శాతం బోర్లకు నీరందడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కువ నీటిఎద్దడి నెలకొన్న మండలాలు 23 ఉన్నాయి. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఎక్కువ మండలాలు ఉన్నాయి. ఆ తరవాత స్థానాల్లో నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు వస్తాయి. వనపర్తి పరిస్థితి కాస్త పర్వాలేదు. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ ఉఫ్‌ అనిపించింది. గత అయిదేళ్లుగా ఖరీఫ్‌ సీజనులో జిల్లా రైతులను  వెంటాడుతున్న వర్షాభావం మరోసారి నిరాశకు గురిచేసింది. వాతావరణశాఖ వర్షాలు అనుకూలిస్తాయని చెప్పినా.. ఆ ప్రకటనలు చినుకులు రాల్చని మేఘాల్లా తేలిపోయాయి. 
ఖరీఫ్ కు కరవు కాటు (మహబూబ్ నగర్)

వర్షాకాలం మొదలై నెలరోజులు దాటినా.. ఎక్కడా కావలసినంత లోతుకు భూమి తడిచేలా  వర్షాలు కురిసింది లేదు. అరకొర వర్షాలను నమ్మి వేలాది రైతులు జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, పత్తి వంటి పంటలను ఆతృతకొద్దీ సాగు చేశారు. కొన్నిచోట్ల వర్షాలు అసలు పడకపోవటంతో విత్తు వేసేందుకు బీడు భూములను దున్నేకునే వీలు కలగటం లేదు. తొలకరి వర్షాలకు ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, కంది పంటల్ని ఎక్కువగా సాగు చేస్తారు. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి వేస్తారు. నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ తదితర ప్రాంతాల్లో కంది ఎక్కువగా సాగు చేస్తారు. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర ప్రాంతాల్లో జొన్న సాగు ఎక్కువ. రోహిణి కార్తె మొదలు ఇప్పటివరకు నాగటి సాలు వచ్చే వర్షాలు ఎక్కడా పడలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సగటు వర్షపాతం నమోదు కాలేదు. సాధారణంగా జూన్‌ నెలలో 72.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 59.5 మి.మీ. మాత్రమే నమోదయింది. ఇందులోనూ వర్షాల మధ్య వ్యవధి (డ్రై స్పెల్‌) ఎక్కువ. ఈ కారణంగా వర్షాకాలంలోనూ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఎక్కడా కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు కుంటల్లోకి, గుంతల్లోకి చేరింది లేదు. ఇప్పుడు వర్షాలు కురిసినా.. విత్తనాలు వేసుకునే సమయం దాదాపుగా దాటిపోయింది. వరి నారుమళ్లను చల్లుకుందామనుకున్నా వెనకా, ముందు ఆలోచించాల్సిందే. మరో వారం.. పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజను కథ కంచికి వెళ్లినట్టే. వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను రాష్ట్ర కమిషనరేటుకు చేరవేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలేవీ జిల్లాస్థాయికి ఇంకా అందలేదు. 
నైరుతి రుతు పవనాలు ఉమ్మడి జిల్లాలో ప్రవేశించి నెల రోజులు కావస్తున్నా... ఆశించిన విధంగా వర్షాలు కురవలేదు. ప్రతిరోజు ఆకాశం మబ్బులతో కమ్ముకొంటున్నా వాన మాత్రం రావడం లేదు. దీంతో భూగర్భజలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వనపర్తి జిల్లా ఒక్కటి మినహా మిగతా అన్ని జిల్లాల్లోని మండలాల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది. సాధారణంగా భూగర్భజలాలు 20 మీటర్ల కంటే కిందకు పోతే ఆ ప్రాంతాల్లో నీటిఎద్దడి నెలకొన్నట్లే. ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు రాకపోతే భూగర్భజలాలు ప్రమాదంలో పడతాయి.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 25 నీటి పరీవాహక ప్రాంతాల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ప్రతినెలా నీటిమట్టాలను లెక్కిస్తుంటారు.