పచ్చని ప్రణాళిక (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పచ్చని ప్రణాళిక (కరీంనగర్)

కరీంనగర్, జూలై 19 (way2newstv.com): 
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గత నాలుగు విడతలుగా జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ నర్సరీలు ఏర్పాటుచేసి పెంచిన మొక్కల్ని నాటనున్నారు. అయిదో విడత హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కకూ లెక్క ఉండేలా జియో ట్యాగింగ్‌ వ్యవస్థనూ పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.జిల్లాలో 21 మండలాలు, 479 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 446 నర్సరీలను ఏర్పాటు చేసి 1.53 కోట్ల మొక్కలు పెంచారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 406 నర్సరీల్లో 1.16 కోట్ల మొక్కలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 40 నర్సరీల్లో 37.13 లక్షల మొక్కలను పెంచారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఒక్కో  నర్సరీలో 20 వేల మొక్కల నుంచి లక్ష మొక్కల వరకు పెంచారు. 

చ్చని ప్రణాళిక (కరీంనగర్)

జిల్లా అంతటా హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. టేకు, పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను అయిదో విడత హరితహారంలో నాటనున్నారు.ఈ ఏడాది 1.53 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పలు శాఖల భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ 88.66లక్షల మొక్కలు, అటవీశాఖ 30.99లక్షలు, వ్యవసాయశాఖ 2 లక్షలు, ఉద్యానశాఖ 7లక్షలు, ఎక్సైజ్‌ శాఖ 5 లక్షలు, పోలీసుశాఖ 4 లక్షలు, సెరీకల్చర్‌ 7లక్షలు, నీటిపారుదల శాఖ లక్ష, సింగరేణి 6.25 లక్షలు, టీఎస్‌ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 6లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా ఆయాశాఖలే చూడాల్సి ఉంటుంది.హరితహారం కార్యక్రమం విజయవంతానికి గ్రామ ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకే ప్రతి గ్రామంలో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. గ్రామ సర్పంచి, కార్యదర్శి, హరితరక్షణ కమిటీలు, గ్రామ ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ హరిత రక్షణ కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన తర్వాత సంరక్షణ బాధ్యతలను పూర్తిగా వారికే అప్పగించనున్నారు. వీటి పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి మండలస్థాయి అధికారి, మండలానికి జిల్లాస్థాయి అధికారికి బాధ్యతలు అప్పజెప్పారు. వీరితో పాటు అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టిన వారికి ప్రోత్సాహక బహుమతులతో సన్మానించాలనే ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో ప్రచారం నిర్వహిస్తూ మొక్కలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. ఈ ఏడాది హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణ కల్పించడానికి ప్రాథాన్యం ఇస్తున్నారు. మొక్కలు ఎన్ని నాటారు.. వాటిలో ఎన్ని పెరుగుతున్నాయని లెక్క తెలుసుకోనున్నారు. ప్రతి శాఖకు మండలస్థాయి అధికారులకు జియో ట్యాగింగ్‌ లాగిన్‌ను సమకూరుస్తారు. దీంతో ఆయా శాఖల్లో ఎన్ని మొక్కలు నాటారు.. ఎన్నింటికి రక్షణ కల్పించారు.. తదితర వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. నాటిన మొక్కల పరిస్థితులను ప్రతి నెలా అందులో అప్‌డేట్‌ చేయాలి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయనే వివరాలు అందుబాటులో ఉండటంతో ఉన్నతాధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు. దీంతో మొక్కల తప్పుడు లెక్కలకు తెరపడనుంది.గ్రామస్థాయిలో సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, హరిత రక్షత కమిటీలు, యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు ఇలా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. అన్ని మండలాల్లో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చేపట్టడంపై అవగాహన కల్పించడానికి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. ఈసారి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల పరిరక్షించేందుకు 400 మొక్కలకు ఒక వనసేవకుడ్ని నియమిస్తారు. వీరు మొక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. వీరికి నెలకు రూ. 4,900 వేతనం చెల్లిస్తారు. వాటిని పరిరక్షించడానికి వార్డ్‌ వాచ్‌లను నియమించనున్నారు. సామాజిక వనాల్లో 200 నుంచి 2 వేల మొక్కలకు, పాఠశాలల్లో 100 నుంచి వేయి మొక్కలకు ఒక వన సేవకుడ్ని నియమిస్తారు.