భూగర్భ జలం జాడేదీ..(నిజామాబాద్)

నిజామాబాద్, జూలై 19 (way2newstv.com): 
వానాకాలం ప్రారంభమై 40 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక రోజంతా మబ్బులు పట్టి చినుకులు పడ్డ పరిస్థితి కానరాలేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో సాగు ముందుకు కదలని పరిస్థితి ఉంది. భూగర్భజలాలు వృద్ధి చెందక బోర్లు వట్టిపోయాయి. ఎన్నో ఆశలు, ఆశయాలతో సాగుకు సిద్ధమైన అన్నదాతలు కాడి పట్టేందుకు ముందుకు రావడం లేదు. చినుకు జాడ కోసం నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు.ఏటా జిల్లాలో పసుపు రైతులు జూన్‌ మొదటివారంలోనే విత్తడం పూర్తి చేసేవారు. ఈసారి వర్షాలు లేవని నెలాఖరు వరకు అడపాదడపా వేశారు. 35 వేల ఎకరాల్లో వేయాల్సిన పంట.. కేవలం 11,106 ఎకరాలతోనే సరి పెట్టారు. మొక్కజొన్న 48 వేల ఎకరాలనుకుంటే.. 25,900 ఎకరాలకే పరిమితమైంది. సోయాబీన్‌ 1,09,000 ఎకరాలకు గాను కేవలం 33,992 ఎకరాలే వేశారు. అంటే 29 శాతమే సాగైంది. 
భూగర్భ జలం జాడేదీ..(నిజామాబాద్)

దాదాపు ఆరుతడి పంటలన్నీ జూన్‌లోనే వేసేవారు. ఇందులో సగం వరకు వర్షాధారంగానే పండించే వారు. ఈసారి వర్షాభావంతో విత్తు వేసేందుకు ముందుకురావడం లేదు. ఇక సోయాబీన్‌ వేసే గడువు దాదాపు దగ్గర పడినట్లే.ఇప్పటివరకు సాగైన పంటలు నీరందక ఎండిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లతో నార్లు పోసి నాటుకున్న చోట వరి పొలాలు ఎండిపోతున్నాయి. దమ్ము చేసేందుకు నీళ్లు సరిపోక.. వేసిన జీలుగను అలాగే వదిలేస్తున్నారు. ఇక మొక్కజొన్న, పసుపు, సోయాబీన్‌ పంటలదీ అదే దారి. భూగర్భజలాలు వృద్ధి చెందకపోవడంతో బోర్లతో పారించుకునే పరిస్థితి లేకుండాపోతోంది. జూన్‌ మొదలుకాగానే జిల్లాలో వరి నారు పోసుకోవడం ఆనవాయితీ. 25-30 రోజుల్లోనే నాటుకుంటారు. అంటే జూన్‌ నెలాఖరుకు కల్లా నాట్లేయడం కనీసం 60 శాతం పూర్తయ్యేది. జులై మాసం వచ్చి 20 రోజులవుతున్నా ఇప్పటివరకు 3 శాతానికి మించలేదు. నార్లు ముదిరిపోతున్నాయి. అదనులోనే నాటుకుంటేనే ఆశించిన దిగుబడులు వస్తాయి. లేదంటే 10-20 శాతం నష్టపోతారని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజులు ఆగితే అప్పటికి వానలు పడిన పోసిన నారు పనికి రాదని చెబుతున్నారు
Previous Post Next Post