నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

అమరావతి జూలై 11, (way2newstv.com)
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా మారే అవకాశం ఉందని గతంలో వైఎస్ జగన్ చెప్పారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తెలిపారు. కానీ,ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని జగన్ మార్చుకొన్నారని ఆయన గుర్తు చేశారు.గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో  ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు స్పందించారు. ఏపీ సీఎం జగన్ వయస్సు తన రాజకీయ అనుభవంత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ను జగన్ హిట్లర్‌తో పోల్చిన విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు. అధికారం ఉందని విర్రవీగడం సరైందికాదని ఆయన జగన్‌కు హితవు పలికారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉన్నందున సీఎం జగన్ వ్యతిరేకించకపోవచ్చు...కానీ, భవిష్యత్తులో గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్రం అంగీకరించకపోతే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. 
నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

ప్రస్తుతం కేసీఆర్, జగన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నందున ఇబ్బందులు లేకపోవచ్చన్నారు. కానీ, భవిష్యత్తులో పరిస్థితులు మారితే ఏం చేస్తారన్నారు. తాము అటువైపు.... జగన్ ఇటువైపు వస్తే ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై సభలో  పేపర్లు పెట్టి చర్చించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏది ప్రయోజనమో దాన్ని  అమలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.  మరో వైపు ఆల్మట్టి ఎత్తు పెంపు విషయాన్ని కూడ చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయమై ఆరుగురు సీఎంలతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఈ నివేదిక ఆధారంగా  గేట్లు బిగించవద్దని ఆ కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఆ మేరకు గేట్లు బిగించని విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే అక్కడి నుండి  శ్రీశైలం వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు.కానీ గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలనే ప్రతిపాదన కేసీఆర్ చేసినట్టుగా తాను పత్రికల్లో వార్తలు చూశానని చంద్రబాబు చెప్పారు. కానీ, సభలో మాత్రం  ఈ విషయాన్ని తానే ప్రతిపాదించినట్టుగా సీఎం చెప్పారన్నారు.పోలవరం ప్రాజెక్టుపై ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కేసులు వేసిన  విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఉమ్మడి ఏపీరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో మిగులు జలాలను తాము  అడగబోమని అఫిడవిట్ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీనిపై ప్రస్తుతం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు.