ఉసూరుమంటున్న రైతన్న (కరీంనగర్)

కరీంనగర్, జూలై 17 (way2newstv.com): 
ఊరిస్తున్న మేఘాలు ఉసూరుమనిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమలో అన్నదాతను ఆగం చేస్తున్నాయి. సాగు సమరంలో ఆదిలోనే ఆటంకాల్ని సృష్టిస్తున్నాయి. ఈ సారీ మళ్లీ గడ్డుకాలమనే పరిస్థితులు కర్షకుల కళ్లకు కనిపిస్తున్నాయి. అదును దాటుతున్నా పంటల జాడలేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అసలే ఆలస్యం.. ఇంకా పంటలు వేయడంలో జాగు జరిగితే దిగుబడులపై ప్రభావం తప్పదనే  ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే ఖరీఫ్‌ సీజన్‌పై కరవు ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది.  ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే అంతంత మాత్రంగానే పంటలు వేస్తున్న తీరు కలవరపరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిధానంగానే వ్యవసాయం సా..గుతోంది. 
ఉసూరుమంటున్న రైతన్న (కరీంనగర్)

ఉమ్మడి జిల్లా మొత్తం సాగు అంచనా 10.81లక్షల ఎకరాలు కాగా ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఎకారాల మేర కూడా పంటలు వేయని దుస్థితి నెలకొంది. ప్రధానంగా వేసే వరి పంట విషయంలో ఈ సారి  నిరాశతప్పదని  అన్నదాతల నుంచి వినిపిస్తోంది. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా వరిని వేస్తారు. దీంతోపాటు మొక్కజొన్న, పత్తిని సాగు చేస్తారు. ఇక వేసిన పంటలు కూడా ఎక్కువగా బోర్లు ఉన్న చోటనే వేయడం కనిపిస్తోంది. వ్యవసాయ బోర్లలో అరకొర నీళ్లున్నా వాళ్లు ముందు జాగ్రత్తగా దుక్కులు దున్ని సాగుకు సమాయత్తమయ్యారు. ఇక ఇటీవల అడపాదడపా పడిన జల్లుల్ని చూసిన రైతులు పెద్ద వాన పడితే రంగంలోకి దాగాలనే ఉద్దేశంతో పెట్టుబడుల్ని సిద్ధం చేసుకున్నారు. విత్తనాల కొనుగోలు మొదలు ఎరువుల వరకు ముందస్తుగానే సిద్ధం చేసుకున్నా.. వరుణుడి కోసం మేఘాలవైపు చూస్తున్నారు.ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటి వరకు ఏఏ పంటలకు గడువు ఉండనుంది.? ఏ పంటలు వేసుకుంటే రైతుకు మేలు జరుగనుందనే విషయమై నాలుగు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయిలో అన్నదాతలకు అవగాహన పెంచాల్సిన అవసరముంది. ఆరుగాలం శ్రమలో రైతుకు అనుభవమున్నప్పటికీ అధికారుల సలహాలు, సూచనలు జోడైతే మంచి జరిగే వీలుంది. నీటి వనరుల తీరు.. నీళ్ల ఆదరవు సహా ఇతరత్రా చీడపీడల గురించి ముందస్తు సలహాలు, సూచనలు అందితే సాగు తీరులో ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. పంటమార్పిడి సహా ఇతరత్రా విషయాల్ని వివరిస్తే బాగుంటుంది. లేదంటే పెట్టుబడి రూపంలో తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితులు  ఎదురవనున్నాయి. మరోవైపు నాలుగు జిల్లాల పరిధిలోని ప్రధాన జలాశయాల్లోనూ నీటి జాడలు లేవు. దీంతోపాటు ఎక్కువగా చెరువుల కిందనే పంటలు సాగయ్యే వీలుంది. ఈ సారి ఇప్పటి వరకు చెప్పతగిన స్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. దీంతో అన్నదాతకు సాగు తీరు విషయంలో అంతర్మథనం తప్పడంలేదు.
Previous Post Next Post