అడ్డూ అదుపు లేదు (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్డూ అదుపు లేదు (నెల్లూరు)

నెల్లూరు, జూలై 17 (way2newstv.com): 
నగరం, పట్టణాల్లో నీటి వినియోగానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అక్రమ మార్గంలో వాడుతున్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాలోని పురపాలకసంఘాల్లో వాణిజ్య సముదాయాలకు నీటి మీటర్లు అమర్చే విషయాన్ని అధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. అందరిలానే సాధారణ కుళాయి కనెక్షన్లు ఇచ్చేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో నీటి వాడకం పెరగడంతో పాటు నిర్వహణ భారం పూర్తిగా పుర ఖనాజాపై పడుతోంది. ఆదాయ వనరులు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో నెల్లూరు నగరపాలకసంస్థతో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలసంఘాలు ఉన్నాయి. ఏ పట్టణంలో చూసినా బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఇబ్బడిముబ్బడిగా దుకాణ సముదాయాలు ఉన్నాయి. 
అడ్డూ అదుపు లేదు (నెల్లూరు)

వీటిలో ఎక్కువగా గృహావసరాలను తీర్చే కుళాయి కనెక్షన్లే. దరఖాస్తులను పరిశీలించకుండానే కొందరు అధికారులు, సిబ్బంది కుళాయి మంజూరు చేస్తున్నారు. దీంతో గృహేతర సముదాయాలు ఎంచక్కా సాధారణ నీటిని వాడుకుంటూ పురపాలక ఖజానాకు గండి కొడుతూ వ్యక్తిగతంగా లబ్ధిపొందుతున్నారు.వాస్తవానికి నగర, పురపాలకసంఘాల్లో గతంతో పోలిస్తే చాలా వరకు వాణిజ్య సముదాయాలు పెరిగిపోయాయి. సెల్లార్లు, లాడ్జిలు, నర్సింగ్‌హోమ్‌లు, సముదాయాలు, అపార్టుమెంట్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌, పరిశ్రమలు, కల్యాణ మండపాలు ఇలా చెప్పుకొంటూపోతే నివాసాలు కానివి దాదాపు వాణిజ్యం కిందకే వస్తాయి. వీటిలో నీటి మీటర్లు బిగించకపోవడం వల్ల నిత్యం వేల లీటర్ల నీటిని దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. సరఫరా చేసే తాగు నీటిలో దాదాపు వీటికే సింహభాగం పోతోంది. ఒక్కో సముదాయంలో భూగర్భంలో 5 నుంచి 10వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి సంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు.వాణిజ్య కుళాయిల డొనేషన్ల విషయానికొస్తే 5వేల లీటర్ల వాడకంలోపు రూ.15వేలు, 5 నుంచి పది వేల లీటర్ల నీటికి రూ.24వేలు, 10 నుంచి 20వేల లీటర్ల నీటికి రూ.30వేలు, 20వేల లీటర్ల నీటి వాడకంపై ఆపై రూ.36వేలు, పరిశ్రమలకైతే రూ.25వేల నుంచి రూ.3లక్షలు దాకా వివిధ కేటగిరిలో డొనేషన్లు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ లెక్కన వాణిజ్య సముదాయాలకు నీటి మీటర్లు బిగిస్తే ఏటా నీటి పన్ను రూపేణా రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఇప్పటికే నీటి సరఫరా విభాగంలో చేస్తున్న నీటి సరఫరాపై వచ్చే ఆదాయం కంటే.. చేసే ఖర్చే అధికంగా ఉంటుంది. జీతభత్యాలు, క్లోరినేషన్‌, విద్యుత్తు బిల్లులు, ఫిల్టరేషన్‌, యంత్రాలు మరమ్మతులు తదితర అన్నింటిని కలుపుకొంటే నీటి సరఫరాకు రూపాయి వెచ్చిస్తే, అర్థరూపాయి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇక నీటి పన్ను బకాయిలు దాదాపు రూ.20 కోట్లు దాకా ఉంటుందని అంచనా. నిజానికి స్థానికంగా ఆదాయ వనరులను పెంచుకుని సమస్యలు తీర్చుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా.. వచ్చిన అధికారులకు ఏమీ పట్టడం లేదు. కారణం రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులు మనకెందుకు సమస్య అంటూ ఉన్నన్ని రోజులు పనిచేసుకుని వెనుదిరుగుతున్నారు. ఇక సిబ్బంది చేతివాటంతో అనుమతుల్లేకుండానే ఇబ్బడిముబ్బడిగా కుళాయిలు ఇచ్చేస్తున్నారు. ఒక్క సాధారణ కుళాయి తీసుకోవాలంటే డొనేషన్‌, ఇతర ఖర్చులతో కలిసి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు అవుతుంది. ఇక కార్యాలయం చుట్టూ తిరగాలి. ఇవేమీ లేకుండానే చెయ్యి తడిపితే చాలు ఎక్కడ ఏ ప్రాంతమైనా అధికారుల కళ్లకు కనిపించకుండా కుళాయిలు ఇచ్చేస్తున్నారు.