నీరెక్కడ..? (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీరెక్కడ..? (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, జూలై 9  (way2newstv.com): 
జూలై రెండో వారం వచ్చినా ఇంతవరకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో ఏంచేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పొలాలను దుక్కులు దున్నుకుని నీళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3,16,770 హెక్టార్లు కాగా 3,37,277 హెక్టార్లు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సాధారణ విస్తీర్ణం కూడా పూర్తికాదేమోనని అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.గత ఖరీఫ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నా పట్టిసీమ ద్వారా నీటిని సకాలంలో వదలడంతో రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోగలిగారు. ఈ ఏడాది కూడా పట్టిసీమ నుంచి వదిలే ప్రయత్నం చేసినా తరువాత నీటివిడుదలపై పాలకులు చేస్తున్న భిన్న వ్యాఖ్యలు అన్నదాతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గతంలో జిల్లాలో ఎటు చూసినా పొంగిపొర్లుతూ కాల్వలు కనిపించేవి. గత కొన్నేళ్లుగా ఎగువ జలాశయాలనుంచి దిగువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రెండు పంటలు పండించడం కాదు కదా ఒక పంటే కష్టంగా మారింది. అందుబాటులోకి వచ్చిన పట్టిసీమ ఎండిపోతున్న పొలాలకు ఊపిరిలూది పచ్చని పంటలు పండించేందుకు దోహదపడింది. పట్టిసీమ ద్వారా ఒక పంట అయినా ఏదో ఒకరకంగా సాగు అవుతుందని సంతోషపడుతున్న రైతులు ఈ సారి అది కూడా సాగు చేయగలమా లేదోనని ఆందోళన చెందుతున్నారు.

నీరెక్కడ..? (కృష్ణాజిల్లా)

జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుకు సిద్ధమైన వేళ ప్రభుత్వం నుంచి నీటి విడుదలపై ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం విమర్శలకు తావిస్తోంది. సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెబుతున్నా ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారనేది చెప్పడం లేదు. ఇంతవరకు ఆదిశగా జిల్లా స్థాయి సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో పాటు ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నీటి విడుదలపై పాలకులు ఏదో ఒక విషయం చెబితేనే సాగుకు సిద్ధమవ్వాలని రైతులు భావిస్తున్నారు. బందరు మండలంతో పాటు పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, ఘంటసాల తదితర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులందరూ పొలాలను దుక్కుదున్నుకుని, కావాల్సిన విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ఎక్కడికెళ్లినా సాగునీటి సమస్యపైనే రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి నీటివిడుదలపై అన్నదాతలకు భరోసా కల్పించాలి. ఈ ఏడాది ప్రకృతి కూడా పగబట్టింది. రుతుపవనాలు సైతం ఏటాకంటే రెండు వారాలు ఆలస్యంగా వచ్చినా వర్షాలు కురుస్తాయని అందరూ ఆశించారు. ఇప్పటివరకూ ఎక్కడా ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఇటు వానలు కురవకపోవడం.. అటు కాలువలు వదలకపోవడంతో సాగు ఎలా అని రైతులు మదనపడుతున్నారు.
జిల్లాలో బోర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం రైతులు నారుమళ్లు పోస్తున్నారు. విజయవాడ రూరల్‌, గన్నవరం, ఉయ్యూరు. తోట్లవల్లూరు, మోపిదేవి, కంకిపాడు, మొవ్వ, తిరువూరు, విస్సన్నపేట, చాట్రాయి, మైలవరం, ముసునూరు, పమిడిముక్కల, పెనమలూరు, నందివాడ, గుడివాడ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1297 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా నారుమళ్లు పోయలేదు. సాగునీటిపై సందిగ్ధంతో పెడన, గూడూరు, తదితర మండలాల్లో వెదపద్ధతిలో సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వర్షాలు కురిస్తేనే ఈ సాగైనా సక్రమంగా సాగుతుంది. లేదంటే రైతులు ఇబ్బందులు పడక తప్పదు. గతంలో కూడా వెదసాగు చేసిన రైతులు నీటి సమస్యతో మొలకలు సక్రమంగా రాకపోవడంతో మళ్లీ దున్ని నాట్లు వేశారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పాలకులు సకాలంలో నీళ్లు వదిలేలా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.