ఆకలి కేకలు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆకలి కేకలు (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూలై 9 (way2newstv.com): 
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లుగానే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేయగానే ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లోని వేలాది మంది విద్యార్థులకు పథకం చేరువైంది. అటువంటి పథకాన్ని నిలుపుదల చేయమని ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గతేడాది జులైలో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో దూర ప్రాంతాల నుంచి ఆయా కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఉదయాన్నే భోజనం తయారీ కోసం ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా నేరుగా కళాశాలకు హాజరై మధ్యాహ్న సమయంలో భోజనం చేసే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు భోజన పథకం చేరువ కావడంతో ఆ ప్రభావం ఈ ఏడాది పలు కళాశాలల్లో నూతనంగా చేరే విద్యార్థుల సంఖ్యపై చూపింది. ఆయా కళాశాలల్లో హాజరుశాతం గణనీయంగా పెరిగింది.
 ఆకలి కేకలు (పశ్చిమగోదావరి)


రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ఏటా రూ.23 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో విద్యార్థికి రూ.13 చొప్పున వెచ్చించారు. అన్నంతోపాటు పప్పు, సాంబారు, వారానికి అయిదురోజులు కోడి గుడ్లు, రసం వడ్డించారు. 14 ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఆవరణలో భోజనం తయారీకి అవకాశం ఉండటంతో అక్కడి వంటశాలలోనే తయారు చేయించి విద్యార్థులకు వడ్డించేవారు.జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. పదో తరగతి అనంతరం కొందరు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సామగ్రి అందిస్తూ చేయూతనిస్తున్నాయి. దాతలు కూడా విద్యార్థులకు అవసరమైన పలు వసతులను ఆయా కళాశాలల్లో కల్పిస్తుండటంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది సుమారు 12వేల మంది విద్యార్థులకు పైగా హాజరు నమోదయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉదయం 7 గంటలకే బయలుదేరి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కళాశాలకు చేరుకుంటున్నారు. ఇటువంటి వారు హోటళ్లలో నిత్యం భోజనం చేయాలంటే నెలకు సుమారు రూ.2వేల వరకు అదనపు భారం అవుతుంది.ముందస్తు సమాచారం లేకుండా పథకం నిలిపివేయడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కుటుంబాల్లోని పిల్లలకు ఆకలిబాధ లేకుండా మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడుతుందని, అటువంటి పథకాన్ని ఒక్కసారిగా నిలిపేస్తున్నట్లు అధ్యాపకులు ప్రకటించడంపై ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా లేకుండా పథకం ముగించినట్లు చెప్పడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.