ఏలూరు, జూలై 20 (way2newstv.com):
రైతులకు కల్పతరువుగా ఉన్న కాల్వలకు భద్రత కొరవడి..ప్రయాణికుల ప్రాణాలను ఆవిరి చేస్తున్నాయి. కాల్వల పొడవునా ఉన్న రహదారులు ప్రమాదాలకు వారధులుగా మారుతున్నాయి. వీటికి పటిష్ట భద్రత చర్యలు చేపట్టకపోవడానికి తోడు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా తాడేపల్లిగూడెం-రాజమహేంద్రవరం(వయా నిడదవోలు) ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై నిత్యం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీనిపై సుమారు 20 కిమీ వరకు ఏలూరు కాలువ, 8 నుంచి 9 కిమీ మేర పశ్చిమడెల్టా ప్రధాన కాలువను ఆనుకుని, ప్రయాణించాల్సి ఉంది.
కాలువలు పట్టవా..? (పశ్చిమగోదావరి)
సమిశ్రగూడెం నుంచి విజ్జేశ్వరం వరకు ప్రధాన కాలువ పొడవునా ప్రమాదాలు జరగకుండా సుమారు రూ.50 లక్షలతో రక్షణ గోడ నిర్మించాలని 17 ఏళ్ల కిందట అధికారులు ప్రతిపాదించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో పలు వాహనాలు కాల్వలోకి దూసుకుపోయి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.జిల్లా వ్యాప్తంగా కాలువల వెంబడి నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. గతంలో విజ్జేశ్వరం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటో రాత్రి 11 గంటల సమయంలో కాలువలోకి దూసుకుపోయి ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తున్న కారు గోపవరం-సమిశ్రగూడెంల మధ్య కాలువలోకి దూసుకుపోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందగా, ఇద్దరు యువకులకు గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. మద్దూరు బల్లకట్టు వద్ద మినీలారీ కాలువలోకి దూసుకుపోయిన సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ గోడల (రిటైనింగ్ వాల్స్) నిర్మాణానికి చాలా ఏళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. అయినా అవి కార్యరూపం దాల్చడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువల పొడవునా వీటి నిర్మాణానికి వివిధ దశల్లో సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. అయినా అవి కార్యరూపం దాల్చలేదు. రక్షణ గోడలను పూర్తి స్థాయిలో నిర్మిస్తే.. ఏటా సుమారు 15 నుంచి 20 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చు. ప్రమాదాలు జరగడానికి స్థానికులు కూడా కొంతవరకు బాధ్యులవుతున్నారు. పశువులను తమ ఇష్టానుసారంగా కాల్వల్లోకి దింపేస్తున్నారు. పశువులను కాలువలోకి దింపుతున్న ప్రతి చోట రహదారులు కోతకు గురై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి వారిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్ఛు పైగా కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులకు అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. రాజమహేంద్రవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం వెళ్లే ప్రధాన రహదారులు అనేక చోట్ల కోతలకు గురయ్యాయి.
Tags:
Andrapradeshnews