నిజామాబాద్, జూలై 20 (way2newstv.com):
కొన్నిరోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు చిన్నారులు వీటి బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే తల్లిదండ్రులు దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా డయేరియా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో సతమతమవుతున్నారు. వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన పక్కా ప్రణాళిక లోపించింది. నగరం మొదలుకొని గ్రామాల వరకు చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అధికారులు మొక్కుబడి చర్యలతో చేతులు దులిపేసుకొంటున్నారు. పల్లెల్లోని పీహెచ్‌సీల విషయానికి వస్తే వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది.
సీజనల్ ఎటాక్ (నిజామాబాద్)
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే పరిస్థితి. ఉన్న చోట సమయపాలన ఉండదు. ఉన్నవారు మనకెందుకులే అని జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చేసరికి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి పరిస్థితి అదుపు తప్పుతోంది. ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో బాధ్యతగా పనిచేస్తే జిల్లా ఆసుపత్రిపై భారం పడే అవకాశం ఉండదు.వర్షాకాలంలో యాంటిలార్వా ఆపరేషన్ చేయాల్సి ఉండగా అధికారులు చోద్యం చూస్తున్నారు. నగర పాలక సంస్థ యంత్రాంగం ఎన్నికల బిజీలో పడి అన్నీ మరిచిపోయింది. మాలాథిన్, టైమిపాస్ ద్రావణాలను నిల్వ ఉన్ననీళ్లలో పిచికారీ చేయాలి. ఫాగింగ్ ద్వారా దోమలను నివారించాలి. వాస్తవ పరిస్థితుల్లో సిబ్బంది కొరత, నిర్లక్ష్యం సమస్యగా మారింది. ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధపడుతున్నవారి రక్తనమూనాలు సేకరించి పరీక్షించేవారు. దోమల మందు పిచికారీ చేసి తక్షణ చర్యలు చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పీహెచ్‌సీకి, యూపీహెచ్‌సీకి వెళ్లితే గంటల కొద్ది ఎదురుచూశాక రక్తం సేకరించి పంపుతున్నారు. వర్షాకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం ధ్వారా డయేరియా సోకుతుంది. వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కడుపు నొప్పి, దాహం, నోరు పొడిబారడం, చర్మం మడతలు పడటం, మూత్రవిసర్జన తగ్గిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఇది ప్రాణాంతకం కూడా.డెంగీ వ్యాధి కారక దోమ కేవలం మంచినీళ్లలో మాత్రమే పెరుగుతుంది. ప్రధానంగా ఇంటి చుట్టూ వాడి పారేసిన కొబ్బరి బొడ్డాల్లో, దాబాపై ఉంచిన పాతటైర్లలో, కొబ్బరి చిప్పల్లో నిలిచిన నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. ఇవి ఉదయం పూట మాత్రమే కరుస్తాయి. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించడం మంచిది.
Tags:
telangananews