జలీల్ ఖాన్ పోలిటికల్ ఫ్యూచర్ ఏంటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జలీల్ ఖాన్ పోలిటికల్ ఫ్యూచర్ ఏంటీ

విజయవాడ, జూలై 26, (way2newstv.com)
జలీల్ ఖాన్‌. విజ‌య‌వాడలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క మైనార్టీ నాయ‌కుడు. కాంగ్రెస్ నుంచి వైసీపీ అటు నుంచి టీడీపీలోకి మారి.. త‌న‌కు అన్ని పార్టీలూ స‌మాన‌మే.. త‌న అవ‌స‌ర‌మే.. త‌న రాజ‌కీయం అని నిరూపించారు. 2017 వ‌రకు ఆయ‌న పేరు కేవ‌లం కృష్ణా జిల్లా వ‌ర‌కు మాత్రమే ప‌రిమితం. అయితే, 2017లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఆయ‌న‌ను ఓ ఆన్‌లైన్ ఛానెల్ ప్రతినిధి ప్రత్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాను బీకాం చ‌దివాన‌ని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయ‌న బీకాంలో ఫిజిక్స్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించి ఒక్కసారిగా ఓవ‌ర్ నైట్ రాష్ట్ర రాజకీయాల్లో జ‌లీల్ ఖాన్‌ సంచ‌ల‌నానికి వేదిక అయ్యారు.రాజ‌కీయ నేత‌ల‌కు సాధార‌ణంగా చ‌దువు పెద్దగా అబ్బద‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే, రాను రాను పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివిన వారు కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు. 
జలీల్ ఖాన్ పోలిటికల్ ఫ్యూచర్ ఏంటీ

అయితే, పాత‌త‌రాన్ని జ్ఞప్తికి తెస్తూ.. జ‌లీల్ చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం సృష్టించాయి. దీంతో రాష్ట్రంలో జ‌లీల్ ఖాన్ అనే పేరు క‌న్నా కూడా బీకాంలో ఫిజిక్స్ పొలిటీషియ‌న్‌గా ఆయ‌న పేరు ప‌డిపోయారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏంటి? ఆయ‌న ఫ్యూచ‌ర్ పాలిటిక్స్ ఎలా ఉండ‌నున్నాయి? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్‌తో ప్రారంభ‌మైన జ‌లీల్ ఖాన్‌ రాజ‌కీయం.. ఎమ్మెల్యేగా గెలిచేలా చేసింది. అనంతరం, నేరుగా అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ధ‌ర్మపురి శ్రీనివాస్‌తో ఢీ అంటే ఢీ అని వివాదాన్ని కొని తెచ్చుకున్నారు.ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ త‌ర‌ఫున 2014లో మ‌రోసారి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  జ‌లీల్ ఖాన్‌ విజ‌యం సాధించారు. అయితే, ఆ త‌ర్వాత మంత్రిప‌ద‌విపై ప్రేమ‌తో ఆయ‌న చంద్రబాబు గూటికి చేరిపోయారు. ఇంత‌లోనే ఆయ‌న చేసిన బీకాంలో ఫిజిక్స్ వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ప‌డి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వకుండా దూరంగా ఉంచారు. ఇక‌, ఆ త‌ర్వాత చాన్నాళ్లకు రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డుకు చైర్మన్‌గా నియ‌మించారు.ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్‌ అనారోగ్య కార‌ణాల‌తో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న త‌న కుమార్తె ష‌బానా ఖ‌తూన్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి.. టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు. వైసీపీ అభ్యర్థి వెలంప‌ల్లి శ్రీనివాస్ చేతిలో ఖ‌తూన్ ఓడిపోయారు. దీంతో ఆమె వెంట‌నే అమెరికా వెళ్లిపోయి.. సాఫ్ట్ వేర్ బిజినెస్‌లో మునిగిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇక‌, జ‌లీల్ ఖాన్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు ఇక తెర‌ప‌డిన‌ట్టేనా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ప్రస్తుతం ఆయ‌న ఏ రాజ‌కీయ కార్యక్రమాల్లోనూ పాల్గొన‌డం లేదు. టీడీపీ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబుకు మొహం కూడా చూపించ‌లేదు.ఒక ప‌క్క అనారోగ్యం, మ‌రోప‌క్క రాజ‌కీయ వార‌సురాలు ఘోరంగా ఓట‌మి పాల‌వ‌డంతో జ‌లీల్ ఖాన్ కుటుంబం దాదాపు రాజ‌కీయాల‌కు ఇక దూర‌మైన‌ట్టేన‌ని అంటున్నారు. ఇక్కడే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది ఇదే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నాగుల్ మీరా.. త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టుకుని ఎదిగేందుకు విజ‌య‌వాడ ఎంపీ నానికి మ‌ద్దతుదారుగా మారిపోయారు. అంటే, రాబోయే రోజుల్లో ఈ టికెట్ ఇక‌, నాగుల్ మీరాకు ద‌క్కడం ఖాయంగా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో జ‌లీల్ కుటుంబానికి టీడీపీలో ఛాన్స్ లేద‌నే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి