గుంటూరు, జూలై 26, (way2newstv.com)
ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల తొలగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడింది. గడిచిన నెల రోజులుగా ఆందోళనకు గురవుతున్న డీలర్లు అసెంబ్లీ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చేసిన ప్రకటన ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనుంది. ఈ బియ్యాన్ని కొత్తగా నియమితులయ్యే గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుడి ఇంటికి చేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి తమ పరిస్థితి ఏమిటో తెలియక డీలర్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
స్టాకిస్టులుగా రేషన్ డీలర్లు
1977వ సంవత్సరం నుండి ఉన్న రేషన్ డీలర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో రేషన్ డీలర్లు ఆందోళనతో పాటు పోరుబాట పట్టే పరిస్థితులు కూడా వచ్చాయి. తమ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నివాసం వద్ద రేషన్ డీలర్లు ఆందోళన చేశారు. తమను కొనసాగించాలంటూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహశీల్దార్లకు వినతి పత్రాలు సైతం అందచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) రేషన్ డీలర్ల రద్దు అంశంపై స్పందించారు. రద్దు ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఏ మాత్రం లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారే లేనిపోని దుష్ప్రచారం చేశారన్నారు. రేషన్ డీలర్ల సేవలను స్టాకిస్ట్‌లుగా ఉపయోగించుకుంటామన్నారు. డీలర్ల నుండే వలంటీర్లు నిత్యావసర వస్తువులు తీసుకుని లబ్ధిదారుల ఇంటికి చేర వేస్తారని స్పష్టం చేశారు.
Tags:
Andrapradeshnews