విజయవాడ, జూలై 24 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మహిళలకు పెన్షన్లపై అసెంబ్లీలో మంగళవారం జరిగిన రగడ, బుధవారం సైతం కొనసాగింది. టీడీపీ సభ్యులను సభ నుంచి బహిష్కరించడాన్ని ప్రతిపక్షం మండిపడింది. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి అంశాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని, మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్న విషయాన్ని మరోసారి సీఎం గుర్తుచేశారు. అయినా ప్రతిపక్ష టీడీపీ తమపై విమర్శలు చేయడం సరికాదని, అనవసర చర్చలతో సభాసమయాన్ని వృథా చేయరాదని జగన్ సూచించారు.
ప్రతి అంశాన్నీ టీడీపీ అడ్డుకుంటోంది : జగన్
సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారని, కానీ స్పీకర్ పెద్దమనసుతో మళ్లీ ఆయనకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి సమాధానం చెప్పిన తర్వాత మళ్లీ అవకాశం అడగడమేంటని సీఎం నిలదీశారు. సభ ప్రారంభమై గంటసేపైనా ఇప్పటి వరకు కేవలం 3 ప్రశ్నలకే సమాధానం చెప్పగలిగామని, మిగతా వాటికి కూడా బదులిచ్చేందుకు సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. కాగా, అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కారాల్లో 29 మంది చావుకు కారణమెవరని ప్రశ్నించారు. ఈ చావులకు కారణమైన కారణమైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో అక్కడ సినిమా షూటింగ్ జరపడం వల్లే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. పుష్కరాల్లో వేల కోట్ల దోపిడీ జరిగిందని, అది కుంభమేళా కాదని.. కుంభకోణమని ఆయన ఆరోపించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టారని, మరోవైపు కృష్ణ పుష్కరాల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని, వందలాది ఇళ్లను నేలమట్టం చేశారని జోగి రమేశ్ దుయ్యబట్టారు.
Tags:
Andrapradeshnews