హైద్రాబాద్, జూలై 26, (way2newstv.com)
తెలంగాణలో పదేళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ నరసింహన్ సేవలు ముగియనున్నాయా? నరసింహన్‌ను మార్చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందా? తెలంగాణలో బీజేపీ బలపడాలంటే గవర్నర్ మార్పు తప్పదా? నరసింహన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు?తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ అధిష్టానం... ఇక్కడ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు... అటు ఏపీలోనూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేసి... ఏపీ బాధ్యతల్ని బిశ్వభూషణ్‌కు అప్పగించారు. ప్రస్తుతం తెలంగాణలోనూ గవర్నర్‌ను మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గవర్నర్ యూ టర్న్ వెనుక
త్వరలోనే నరసింహన్‌ను తప్పిస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.ఉమ్మడి ఏపీ విభజనకు ముందు నరసింహన్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల విడిపోయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు. దాదాపు పదేళ్ల నుంచి గవర్నర్ హోదాలో పనిచేస్తున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టగానే నాలుగు రాష్ట్రాల గవర్నర్లను మార్చేసినా... నరసింహన్‌ను మాత్రం టచ్ చేయలేదు. విభజన సమస్యలను దృష్టిలో ఉంచుకుని... ఆయన్నే కొనసాగించింది.ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. బీజేపీ బలపడుతున్న తరుణంలో గవర్నర్ పదవి కీలకంగా మారింది. నరసింహన్‌ను తప్పించాలంటూ గతంలో రాష్ట్ర బీజేపీ నేతలు అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించడంతో... తెలంగాణలోనూ మార్పు తప్పదన్న ప్రచారం సాగుతోంది. గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్ సర్కార్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టని నరసింహన్... ఇప్పుడు మున్సిపల్ బిల్లుపై కొర్రీ పెట్టడాన్ని చూస్తే... బీజేపీ తన గేమ్ మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది.
Tags:
telangananews