దివిసీమలో అమ్మో...పాము - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దివిసీమలో అమ్మో...పాము

విజయవాడ, జూలై 22, (way2newstv.com)
వ్యవసాయ సీజన్‌ మొదలైంది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పాముల బెడద అధికమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ 72 మంది పాముకాటు బారిన పడ్డారు. పాముకాటుకు గురై బుధ, గురువారాల్లో ఇద్దరు మృతి చెందటంతో దివిసీమ ప్రజలు పాముల భయంతో వణుకుతున్నారు. ఈ ప్రాంతంలో మూడేళ్ల నుండి ఈ పరిస్థితి తలెత్తుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన వైద్య సేవలకు అవసరమైన పరిస్థితులు లేకపోవడం సమస్యగా మారింది. పాముకాటుతో ఇటీవల ఇద్దరి మృతికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
దివిసీమలో అమ్మో...పాము

తాచుపాము, కట్లపాము కరిచిన సందర్భాల్లో విష తీవ్రత అధికంగా ఉంటే కాటుకు గురైన వ్యక్తి సృహ తప్పిపోవడం, ఊపిరి అందక శ్వాసతీసుకోవడం కష్టంగా మారుతుంది. రక్తపింజేరి వంటి పాముకాటుకు గురైతే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. వీరికి యాంటీస్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్లను అందించాలి. ఊపిరితిత్తుల్లోకి కృత్రిమ శ్వాస గొట్టం (ఎండో ట్రేఖియల్‌ ట్యూబ్‌) ద్వారా, యాంబు బ్యాగ్‌తో కృత్రిమ శ్వాస అందించాలి. అత్యవసరమైన వెంటిలేటర్‌ మిషన్‌ కేవలం విజయవాడ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసియు)లోనే ఉంది. అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ, చల్లపల్లిలో ఏరియా ఆస్పత్రులు, ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక, నడకుదురు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వీలుగా ఐసియు యూనిట్‌ ఒక్కటి కూడా లేకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సకాలంలో వైద్యం అందక పాముకాటుకు గురైన వారిలో కొందరు మృతి చెందుతున్నారు. దివిసీమ ప్రాంతంలోని ఒకటి, రెండు ఆస్పత్రుల్లోనైనా ఐసియు సౌకర్యాలు కల్పించడం ద్వారా పాముకాటుకు గురైన వ్యక్తుల మరణాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఏరియా ఆస్పత్రులు, పిహెచ్‌సిల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దివిసీమ నుంచి సుమారు రెండున్నర గంటలపాటు ప్రయాణించి విజయవాడకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో, అప్పటికే పరిస్థితి విషమిస్తోంది. చికిత్స చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. సమీపంలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉంటే జతిన్‌, సీతమ్మ ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇద్దరి మృతి తర్వాత అవనిగడ్డ, చల్లపల్లిలోని ఏరియా ఆస్పత్రులతోపాటు పిహెచ్‌సిల్లోనూ యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్లను అందుబాటులో ఉంచారు. ఈ ఇంజక్షన్ల వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఈ ఇంక్షన్‌ ఇవ్వడంతోపాటు అత్యవసర చికిత్స అందించాలి. ఐసియులో ఉంచాలి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలి. ఏరియా ఆస్పత్రిల్లోనూ, పిహెచ్‌సిలోనూ అత్యవసర చికిత్సకు అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లు, లేబరేటరీలు, పరికరాలు వంటివి అందుబాటులో లేవు. దీంతో, పరిస్థితి విషమించిన వారిని విజయవాడ తరలించాల్సిన పరిస్థితులున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గింది. నదీ, కాలువ గట్లు, సముద్ర తీరాల్లో ముళ్లకంపలు, తుప్పలు విపరీతంగా పెరిగాయి. ఇవి పాముల సంతాన వృద్ధికి కారణంగా మారాయి. వర్షాలకు పుట్టల్లోకి నీరు చేరడంతో పాములు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఇళ్లు, గడ్డివాములు, పొలాల్లోని గట్లపై అత్యధిక సంఖ్యలో చేరుతున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పాముకాటుకు గురికావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఘంటసాల మండలం వేములపల్లి, నాగాయలంక మండలం దిండి గ్రామంలో ఇళ్లల్లో నిద్రిస్తున్న సమయంలోనే ఇద్దరు పాముకాటుకు గురై మరణించారు. పాముకాటుకు గురైన నాగాయలంకకు చెందిన కొఠారి మహిధర్‌స్వామి, కోడూరు మండలం మందపాకలకు చెందిన దాసరి రాజేశ్వరమ్మ, రామకృష్ణాపురానికి చెందిన మేడా వెంకటేశ్వరరావు, బడేవారిపాలేనికి చెందిన యలవర్తి శేషగిరిరావు, టి.కొత్తపాలేనికి చెందిన భూపతి ప్రశాంత, మోపిదేవికి చెందిన పులి సీతమ్మ, పెదప్రోలుకు చెందిన మానికొండ శ్రీనివాసరావు, కోసూరిపాలేనికి చెందిన బండేటి వెంకటప్రసాద్‌, తుంగల రేణుకయ్య, అవనిగడ్డ మండలం బందలాయిచెరువుకు చెందిన గాజుల గిరిజ అవనిగడ్డలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2017లో 466 మంది, 2018లో 558 మంది పాముకాటుకు గురయ్యారు.