నామమాత్రంగా వానలు... ఎండుతున్న పంటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నామమాత్రంగా వానలు... ఎండుతున్న పంటలు

కర్నూలు, జూలై 22, (way2newstv.com)
ఏటా నష్టాలే.. సకాలంలో వర్షాలు పడక కన్నీళ్ల సేద్యమే అయినా సాగు విషయంలో రైతు వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటి వరకూ పడిన అరకొర వర్షాలకు దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసేందుకు అనువుగా పొలాలు సిద్ధం చేసుకున్నారు. పంట సాగుకు సిద్ధంగా ఉన్న రైతన్నకు ఈసారి వరుణుడు పరీక్ష పెడుతున్నాడు. ప్రతి రోజూ మేఘాలతో ఊరిస్తూనే నిరాశలోకి నెడుతున్నాడు. నేలను నమ్ముకున్న రైతు కొన్నేళ్లుగా వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. అయినా వర్షాలు కురవడం లేదు. ఒకవేళ కురిసినా ప్రాణం పోయే మనిషికి నోట్లో నీటితడి అందించినట్లుగా మొక్కలకు ప్రాణం పోసేలా కురుస్తున్నాయే తప్ప పదునైనా వర్షాలు కురవడం లేదు. ఇలాగే కొనసాగితే సేద్యం చేయడం కష్టమవుతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రంగా వానలు... ఎండుతున్న పంటలు

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు రైతులకు, అవసరమైన విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు. ఏటా జూన్‌ మొదటి వారంలో మృగశిర కార్తె ప్రవేశంతో విత్తనాలు నాటితే పంట దిగుబడి బాగా వస్తుందన్న నమ్మకంతో రైతులు విత్తనాలను వేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి విత్తనాలు మొలకెత్తగా ఈ సారి మాత్రం జూన్‌ మొదటి వారంలో వేసిన విత్తనాలు వర్షాలు పడకపోవడంతో పనికి రాకుండా పోయాయి. కొన్ని గ్రామాల్లో ఒకటి రెండు వానలు పడ్డా ఎండల తీవ్రత కారణంగా మొలకెత్తలేదు. వేసిన నష్టపోకుండా సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. వేల రూపాయలతో కొనుగోలు చేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి విత్తనాలు కొంటున్నారు. వర్షం కోసం రైతులు వారం రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. జూపాడుబంగ్లా మండలంలోని తరిగోపుల, తుడిచెర్ల గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరిగోపుల గ్రామంలో సుంకులమ్మ, లింగమయ్య స్వామికి భక్తులు 1001 బిందెల నీటితో జలాభిషేకం చేశారు. తుడిచెర్ల గ్రామంలో మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. అవుకు మండలంలోని జూనుంతల, ఉప్పలపాడు, మెట్టుపల్లె, సంగపట్నం గ్రామాల్లో మెట్టపైర్లు పత్తి వేరుశనగ మొక్కజొన్న మినుము ఉల్లి తదితర పంటలను సాగు చేశారు. మిగతా గ్రామాల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేసే సమయం ఆసన్నమైనప్పటికి వరుణుడు కరుణించడం లేదు. ఇప్పటికే 5020 హెక్టార్లలో పంట సాగు చేయాలి. ఈ సంవత్సరం 200 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. ముందస్తు సాగు చేపడితే అధిక దిగుబడి వస్తుందని రెండవ పంట వేసుకునేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతుంది. పంట వేసే సమయం మించిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పంట సాగుకు అవకాశం మించిపోలేదు. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెలలో వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.పాములపాడు మండలంలో 7157 హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రధానంగా మొక్కజొన్న పంట 3989, కంది 547, వరి 1113 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఈ పంటలే కాక మినుము, శనగ, పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది మొక్కజొన్న 654 హెక్టార్లలో సాగు చేశారు. వర్షాలు లేక మరికొంత మంది రైతులు విత్తనాలు వేయలేదు. ప్రభుత్వం రాయితీ విత్తనాలు సకాలంలో ఇవ్వలేదు. అయినా రైతన్నలు అప్పు చేసి ఖరీఫ్‌ సాగుకు కొనసాగిస్తున్నారు. కానీ వరుణుడు కరుణించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రెండేళ్లుగా అరకొర వర్షాలు కురిసాయి. వచ్చిన పంటతో పెట్టుబడి కూడా ఎళ్లక అప్పుల ఊబిలో రైతన్నలు ఉన్నారు.ఈ ఖరీఫ్‌ మరింత అప్పులో పడుతామని ఆందోళన చెందుతున్న పరిస్థితి. గత సంవత్సరం పాములపాడును కరువు మండలంగా ప్రకటించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి కరువు సహయాన్ని అందించలేదు.  ఈ ఖరీప్‌ సీజన్‌లో ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో అనుకున్న స్థాయిలో వర్షం పడడంతో రైతులు ఎక్కువగా పత్తి, మొక్కజోన్న పంటల వైపు మొగ్గు చూపారు. కానీ విత్తనం వేసిన తరువాత వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. మొక్కజొన్న పంటకు ఈ రెండ్రోజుల్లో మంచి పదునైన వర్షాలు రాకపోతే రైతులు వాటిని చెడగోట్టే పరిస్థితి నేడు ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉంది. ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రధానంగా మొక్కజొన్న 10159 హెక్టార్లకు గాను 6900 హెక్టార్లలో సాగు చేశారు. కానీ ఈ సారి రైతులు పత్తిపంట వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఏప్రిల్‌లో 14.73 మి.మీ, మేలో 16.84 మి.మీ జూన్‌లో సాధారణ వర్షపాతం 92.90 మి.మీ గాను 134.76 మి.మీ కురిసింది. జులైలో 169.30 మి.మీకు గాను ఇప్పటి వరకు 36.80 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది. డివిజన్‌లో సాధారణ పత్తి పంట విస్తీర్ణం 2400 హెక్టార్లు కాగా ఇప్పటికే రైతులు వర్షంపై ఆధారపడి, బావుల కింద మొత్తం 3900 హెక్టార్లకు పైగా సాగు చేశారు. తెల్లబంగారం పంట తమను గట్టేక్కిస్తుందని రైతులు ఆశతో పత్తి పంట వైపు మొగ్గు చూపారు. ఆత్మకూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని ఆత్మకూరు మండలంలో సాధారణంగా 233 హెక్టార్లకు గాను 616 హెక్టార్లలో సాగు చేశారు. రైతులు ఇప్పటికే పత్తి పంటకు ఎకరాకు రూ.20 వేలు ఖర్చులు పెట్టుకున్నారు. విత్తనాలు వేసేందుకు, దుక్కులు దున్నేందుకు, కూలీలకు కలుపు తీసేందుకు ఇప్పటి వరకూ ఎకరాకు ఈ ఖర్చును రైతులు పెట్టుకున్నారు. ప్రస్తుతం వర్షాలు పడకపోతే మొక్కజొన్న, పత్తి పంట దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు