అప్పటి రంగాను మళ్ళీ చూసినట్లుంది : - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అప్పటి రంగాను మళ్ళీ చూసినట్లుంది :

దర్శకుడు ధవళ సత్యం
ఒకరు జనాలకు ధైర్యం చెప్పేవారు. మరొకరు జనాల్లో సినిమా వినోదాన్ని పంచేవారు. ఇద్దరు భిన్నదృవాలైనా ఇద్దరినీ కలిపింది ఒక్కటే. అదే వెండితెర. ఒకరు వంగవీటి మోహనరంగ అయితే మరొకరు సురేష్‌ కొండేటి. 1984లో రంగా గురించి 'చైతన్యరథం' వస్తే ఆయన పాత్రను భానుచందర్‌ పోషించారు. చిత్ర దర్శకుడు ధవళసత్యం ఆయన్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని రంగా శైలిని ఆయనకు అలవాటు చేశాడు. కట్‌ చేస్తే.. మళ్ళీ 2019లో యాదృశ్చికంగా 'దేవినేని' అనే చిత్రం తెరకెక్కపోతుంది. అందులో రంగా పాత్ర కీలకం. ఆ పాత్రను పోషిస్తున్న సురేష్‌ కొండేటి స్టిల్‌ను ఇటీవలే రంగా జయంతి సందర్బంగా విడుదల చేశారు. దానికి అనూహ్యస్పందన వచ్చింది. ముఖ్యంగా అప్పటిలో రంగాతో కొంతకాలం ట్రావెల్‌ చేసిన ధవళ సత్యం కొండేటి స్టిల్‌ చూసి ముగ్థులయ్యారు. అప్పటిలో ఆయన్ను నేను ఎలా చూశానో అలానే సురేష్‌ వుండడం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన గురించి తెలిసిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకోవాలని ఈ విధంగా తెలియజేశారు.
రంగాతో పరిచయం
అప్పటి రంగాను మళ్ళీ చూసినట్లుంది : 

రంగాగారి గురించి చాలా రకాలుగా అనుకొనేవారు. జనాలు భయపడేవారు. అలాంటి వ్యక్తిని ఓసారి దాసరిగారి ఇంటిలో అనుకోకుండా చూశాను. గురువుగారు ఫోన్‌ చేసి రమ్మంటే వెళ్ళాను. ఎదురుగా చిన్నకుర్రాడులా ఓ వ్యక్తి వున్నాడు. ఎవరో అని అనుకున్నా. గురువుగారు నన్ను ఆయనకు పరిచయం చేశారు. తను నా గురించి తెలుసన్నారు. నాకు ఆయన తెలియదని చెబితే.. వెంటనే గురువుగారు.. వంగవీటి మోహనరంగాగారురా! మన రంగా! అంటూ పరిచయం చేశారు. నేను కాసేపు అలానే చూస్తుండిపోయా. ఆ తర్వాత ఆయన అసలు విషయం చెప్పారు. రంగాగారిపై సినిమా చేయాలన్నారు. అప్పటికే తను ఎం.ఎల్‌.ఎ.గా వున్నారు. నేనూ ఆ సమయంలో కమ్యూనిస్టుపార్టీలో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నా. పలు సభల్లో రంగాగురించి విమర్శించానుకూడా. అందుకే నాకు ఆ చిత్రం ఇబ్బంది కలుగుతుందని చెప్పి.. పార్టీ పర్మిషన్‌ తీసుకుని చేస్తానని దాట వేశాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సినిమా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు కథ చెప్పాడు. అది నచ్చలేదని చెప్పేశా. నాకు తెలిసిన రంగా కథ ఇదికాదు.. అంటూ.. మీతో కొంతకాలం ట్రావెల్‌ అయ్యాక మీ గురించి తెలిసాక పూర్తి కథ నేనే రాస్తానని చెప్పడంతో.. నా ధైర్యం నచ్చి నీలాంటి దర్శకుడే కావాలని రంగా మెచ్చుకున్నారు. అలా 'చైతన్యరథం' తెరపైకి వచ్చింది.
రంగా సౌమ్యుడు
అయితే నాకు తెలిసిన రంగా చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు.. 'ఏంటమ్మా.. ఏంటీ విషయాలు. వేషాలు ఎక్కువయ్యాయంటగదా.. కాలు చెయ్యి తీసేద్దామా.. ఎందుకంటే నువ్వు బతకాలికదా.. భార్య పిల్లలు చక్కగా చూసుకోవాలికదా.. ఏంటి చెప్పు ఇది కరెక్టేనా! అంటూ.. చాలా సౌమ్యంగా చెబుతూ కళ్ళతోనే ఎదుటివారికి క్లారిటీ ఇచ్చేవాడు. ఆయనతోపాటు చాలారోజులు కారులో తిరిగాను. ఆయన హావభావాలు, అక్కడి సంఘటనలు రాసుకునేవాడిని. అన్ని ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినవాడు. అందరూ తనవారే అనుకునేవారు. ఇప్పుడు.. కొండేటి స్టిల్‌ను చూస్తుంటే.. అచ్చం అప్పటి రంగానే చూసినట్లుంది. సురేష్‌ మాటతీరుకూడా అచ్చుఅలానే వుంటుంది. ఆయన నేత్రాలు కూడా అలానే వున్నాయి. ఇద్దరికీ పోలికలున్నాయి. అందుకే సురేష్‌ను ప్రత్యేకంగా అభినందించకుండా వుండలేకపోతున్నా. ఈ సినిమా ద్వారా సురేష్‌కు మంచి పాత్రలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. అని చెప్పారు.