రైతు భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ సాయంపై లేని స్పష్టత
విజయవాడ, జూలై 9 (way2newstv.com):
వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతనే లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలకు ఎక్కడా పోలిక లేదని, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసే విధానం సామాన్యులకు ఏమాత్రం అంతుపట్టకుండా జగన్నాటకాన్ని తలపిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.
జగన్ మాటలకు, చేతలకు పొంతన కుదరడంలేదు
రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6వేలతో కలుపుకొని రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం రూ.12,500లు చెల్లిస్తుందా? విడిగా రూ.12,500 చెల్లిస్తారా? లేక మా ప్రభుత్వ (టీడీపీ) హయాంలో రూ.4 వేలు ఇప్పటికే చెల్లించడం జరిగింది కాబట్టి వాటిని మినహాయించుకొని మిగిలిన సొమ్ము రైతులకు అందిస్తారా? అన్న ప్రశ్నపై జగన్మోహన్రెడ్డి దగ్గర నుంచిగానీ, ఆపార్టీవారి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు కేంద్రప్రభుత్వం అందించే రూ.6 వేలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో 6,500 రూపాయలు ఇచ్చే విధంగా నోట్ పుటప్ చేశారని తెలుస్తోందన్నారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతుల పేరిట అసత్య పాలనతో ప్రజలను మభ్యపెడుతున్నారని, రాజన్న రైతు రాజ్యం తీసుకొస్తామని చెప్పిన జగన్ కేవలం పేపర్ల ప్రకటనలకే పరిమితమయ్యారని, రైతులకు లబ్ది కలిగే ఏ ఒక్క నిర్దిష్టమైన హామీని నిన్నటి సభలో జగన్ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోగా కేంద్ర సహాయాన్ని అడ్డుపెట్టుకొని మేం రైతులకు భారీగా లబ్ది చేకూరుస్తున్నామని ప్రకటనలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి అనంతరం ప్రైవేటు కార్యక్రమంలా మార్చుకొని ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు. దళిత ఎమ్మెల్యేలపై వైసీపీ కార్యకర్తల దాడులను ఖండిస్తున్నామన్నారు.
Tags:
Andrapradeshnews