అటక్కెక్కిన హామీలు (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అటక్కెక్కిన హామీలు (నిజామాబాద్)

నిజామాబాద్, జూలై 27  (way2newstv.com): 
పునరుజ్జీవ పనుల్లో భాగంగా అతి త్వరలో శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీళ్లు తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.? ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. కాల్వ ఆధునికీకరణ అటకెక్కడం... తూముల నిర్మాణంలో జాప్యమే ఇందుకు కారణం.
శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి లక్ష్మి, కాకతీయ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని అందిస్తారు. డిస్ట్రిబ్యూటరీల మీదుగా పొలాలకు చేరతాయి. అయినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. దీన్ని అధిగమించడానికి ప్రధాన కాల్వలకు తూములు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలా చేయడం వల్ల అవసరమైన సమయంలోనే నీటిని వినియోగించుకోవచ్చు...నీటి నిల్వ వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగి బోరుబావులు వినియోగంలోకి వస్తాయి. ఫలితంగా పంట చివరి దశ వరకు నీరు అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. 
 అటక్కెక్కిన హామీలు (నిజామాబాద్)

ఆచరణలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. లక్ష్మి, కాకతీయ కాల్వలు  విస్తరించి ఉన్న ప్రాంతాల్లో సమీప చెరువులను నింపేందుకు తూములు నిర్మిస్తున్నారు. లక్ష్మిపై 14, కాకతీయపై 13 నిర్మించాలని నిర్ణయించారు. కాకతీయ కాల్వపై వేగంగా పనులు జరుగుతుండగా.. పూర్తిస్థాయిలో మన జిల్లాలోని ఆయకట్టుకు నీరందించే లక్ష్మి కాల్వపై మాత్రం ఇప్పటి వరకు మూడుచోట్లే నిర్మాణాలు జరిపారు.  కొత్తపల్లి, వేంపల్లిలో తూము ఏర్పాటు చేసి వదిలేశారు. ఇంకా షెటర్లు అమర్చాల్సి ఉంది. మిగతా చోట్ల పనులు ఆరంభించలేదు.   తూములు నిర్మించి నిర్దేశించిన చెరువులోకి నీరు వెళ్లేలా డిస్ట్రిబ్యూటరీలకు అనుసంధానం చేయాల్సి ఉంది. పొలాల మధ్యలోంచి వెళ్లిన డిస్టిబ్యూటరీలు కొన్నిచోట్ల రూపును కోల్పోయాయి. కొందరు తమ భూముల్లో కలిపేసుకొన్నారు. సరైన పర్యవేక్షణ లేక హద్దులు చెదిరిపోయాయి. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంలో తూముల వద్ద షెట్టర్లు తెరిస్తే వెళ్లే నీరు పొలాలను ముంచెత్తే పరిస్థితి ఉంది. వీటిని గుర్తించి చర్యలు తీసుకోకుంటే పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి చేపట్టే పనులతో ఆశించిన ప్రయోజనం ఉండదు. లక్ష్మి కాల్వ పిచ్చిమొక్కలు, మట్టికుప్పలతో నిండి ఉంది. చాలా చోట్ల అంచులు ధ్వంసమయ్యాయి. నీరు వృథాగా పోవటమే గాక.. సాఫీగా ముందుకు పారే పరిస్థితి లేకుండా ఉంది. వీటి ఆధునికీకరణ పనులు కొంత మేరే జరిగాయి.  నాణ్యత డొల్లగా ఉందనే ఫిర్యాదులు అధికారులకు చేరుతున్నాయి. కాళేశ్వరం నీరు వచ్చి..విడుదల చేస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది.  లక్ష్మి కాల్వ ఆధునికీకరణ చేపడుతున్న కాంట్రాక్టర్ కే తూముల నిర్మాణం పనులు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరంభించిన నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆలస్యానికి బిల్లుల మంజూరులో జాప్యమే కారణమని కాంట్రాక్టర్ తో పాటు అధికారులు చెబుతున్నారు. ముందస్తు పెట్టుబడి పెట్టలేని స్థితిలో కాంట్రాక్టర్ ఉన్నారని పేర్కొంటున్నారు. బిల్లులు వెంట వెంటనే మంజూరైతేనే మిగతా పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధుల విడుదలపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది