ముందడుగు (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముందడుగు (ఖమ్మం)

ఖమ్మం, జూలై 27  (way2newstv.com): 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు ముందడుగు పడనుంది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున ఆయకట్టులో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల్లో చేలప పెంపకం ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వీటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడంలో జాప్యం నెలకొంటోంది. ఇన్నాళ్లుగా ప్రాజెక్టులకు అనుసంధామైన సాగునీటి సరఫరా కాలువల ఆధునికీకరణ, బలోపేతం వంటి పనులను ఏటా చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డీఆర్‌ఐపీ(డ్యామ్‌ రిహ్యాబిలిటేషన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ స్కీం) పథకం రెండోదశలో రాష్ట్రంలో 33 ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులకు రూ.665.46 కోట్లతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 
ముందడుగు (ఖమ్మం)

దీనికోసం 2017 ఆగస్టులో ప్రభుత్వం ప్రతిపాదనలు కోరడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి నాలుగు మధ్య తరహా ప్రాజెక్టుల పునరుద్ధరణకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.రాష్ట్రంలో డ్రిప్‌ పథకం రెండో దశలో ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం అందించనుంచి. ఈ పథకానికి కేంద్రంలోని జలవనరుల శాఖ సైతం అంగీకరించింది. రాష్ట్రంలో డ్రిప్‌ రెండో దశలో చేపట్టనున్న పనులు, ప్రాజెక్టుల ఎంపిక తదితర అంశాలపై హైదరాబాద్‌లో శుక్రవారం ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచబ్యాంకు అధికారుల బృందం, కేంద్ర ప్రభుత్వంలోని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సహా ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంపిక చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన ఈఈలు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పంపిన ప్రతిపాదనల్లో చేయాల్సిన పనులపై అంశాలవారీగా సమావేశంలో ఉన్నతాధికారులు సమీక్షించననున్నారు. ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల ప్రతిపాదనలకు నిధులు మంజూరవుతాయి. రానున్న సీజన్‌లో ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపడతారు. పాలేరు, లంకాసాగర్‌, పెద్దవాగు, తాలిపేరు ప్రాజెక్టుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా కేవలం డ్యాం ప్రాంతాన్ని పటిష్టం చేసే పనులు చేపడతారు. పాలేరు చెరువు కట్ట లోపలి వైపు రివిట్‌మెంట్‌ రాళ్లు జారిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ రాళ్లు పునరుద్ధరించే పనులు చేయలేదు. ఈ పథకంలో పాలేరు చెరువు కట్ట లోపలి భాగంలో రివిట్‌మెంట్‌ నిర్మాణ పనులు ప్రతిపాదించారు. పాలేరు చెరువు కట్ట వెలుపల వైపు సైతం కట్టను బలోపేతం చేసే పనులు చేపడతారు. కట్ట వెలుపల ప్రాంతంలో పెరిగిన తుమ్మ చెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి చెరువు కట్టను స్లోప్‌గా రూపొందిస్తారు. కట్ట పైభాగం నుంచి వాన నీరు దిగువకు వెళ్లేందుకు అనువుగా డ్రైన్‌ల వంటి కాలువలు స్లోప్‌గా నిర్మిస్తారు. కట్ట వెలుపల భాగంలో మట్టి జారిపోకుండా పటిష్టంగా ఉండేలా గడ్డి పెంచుతారు. కాలువ కట్ట దిగువ భాగంలో సర్వీస్‌ రోడ్‌ నిర్మాణం చేయటంతోపాటు కాలువ కట్ట వైపు జంతువులు వెళ్లకుండా ఫెన్సింగ్‌ నిర్మిస్తారు. అంటే చెరువు కట్ట వెలుపల ప్రాంతం సుందరంగా తీర్చిదిద్దుతారు. సెక్యూరిటీ పోస్టులు నిర్మిస్తారు. ఇదే రీతిలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు కట్టలను పటిష్ట పరచడంతోపాటు సుందరంగా తీర్చిదిద్దుతారు.