అడ్డూ అదుపు లేకుండా తవ్వకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్డూ అదుపు లేకుండా తవ్వకాలు

ప్రమాదంలో గోదా‘వరి‘
రాజమండ్రి, జూలై 26, (way2newstv.com)
విచ్చలవిడి ఇసుక తవ్వకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలో సాగిన ఇసుక అక్రమ తవ్వకాల దుష్ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. సీతానగరం మండలంలోని కాటవరం ఎత్తిపోతల పథకానికి ప్రస్తుతం నీరు అందని దుస్థితి నెలకొంది. నదీ గర్భాన్ని విచ్చలవిడిగా తవ్వేయడంతో ఎత్తిపోతల పథకం ప్రాంతంలో ఆక్వా చెరువులను తలపించేలా పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇన్‌టెక్ వెల్‌కు నీరందక మొత్తంగా పథకాన్ని నిలిపివేయాల్సివచ్చింది. అసలే గోదావరి నదికి నీటి లభ్యత అంతంతమాత్రంగా ఉండటంతో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. 
అడ్డూ అదుపు లేకుండా తవ్వకాలు

పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ భారీ స్థాయిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు నదీ గమన దిశలను మార్చేశాయి. కాస్తంత ఒడ్డున ఉన్న ఇన్‌టేక్ వెల్స్‌కు నీరు చేరేలా ఇసుక మేటలను తప్పించి కాలువలుగా తవ్వినప్పటికీ నీరు అందడంలేదు. దీంతో నీటిని తోడటానికి అవకాశం లేక కాటవరం ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి గోదావరి నదికి వరదలు వచ్చాయి. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా జలాలులేక ఈ పరిస్థితి నెలకొంది. నదీ గర్భాన్ని ఇసుక కోసం విచక్షణా రహితంగా తవ్వేయడంవల్ల నదీ ప్రవాహ దిశల్లో మార్పులు వచ్చాయని జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు. విశాలమైన నదీ భాగం గోతులతో ఆక్వా చెరువులను తలపించే విధంగా మారింది. దీంతో ఒడ్డు అంచునకు గోదావరి జలాలు పారే అవకాశం లేకుండా పోయింది. వరదల సమయంలో నీటితో కళకళలాడే కాటవరం ర్యాంపు ప్రాంతం ఇపుడు ఇసుక తవ్వకాల వల్ల ప్రవాహం నిలిచిపోయింది. కాటవరం వైపు నదీపాయకు నీటి లభ్యత క్షీణించి పోవడం ప్రమాద సంకేతంగా చెప్పవచ్చు.గోదావరి డెల్టాల్లో ప్రస్తుతం వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా గోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరి నాట్లు జోరందుకున్నాయి. వాస్తవానికి ఈసరికే నాట్లు పూర్తి కావాల్సి వుంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించని స్థితిలో ఖరీఫ్ దాదాపు నెల రోజుల పాటు ఆలస్యమైంది. ఇపుడిపుడే నాట్లు పూర్తయ్యే స్థితి నెలకొంది. ఈసారి ఖరీఫ్ అవసరాలకు నదిలో జలాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది నీటి లభ్యత అంతగా కన్పించడంలేదు. మొత్తం గోదావరి డెల్టాలో ఈసారి 9.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లుచేశారు. తూర్పు డెల్టా పరిధిలోని 254 కిలో మీటర్ల పొడవునవున్న సుమారు 2.80 లక్షల ఆయకట్టుకు, మధ్యమ డెల్టాలో 199 కిలోమీటర్ల పొడవు వున్న సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు, పశ్చిమ డెల్టాలోని 11 ప్రధాన కాల్వల ద్వారా సుమారు 563 కిలోమీటర్ల పొడవున్న వున్న సుమారు 5.60 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 22 పంపులను ఆన్ చేసి మొత్తం 7,788 క్యూసెక్కుల జలాలను కృష్ణా డెల్టాకు తోడుతున్నారు. ప్రస్తుతం గోదావరి నది నుంచి ప్రధానంగా పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సుమారు లక్ష ఎకరాలకు, తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి సుమారు లక్షా అరవై వేల ఎకరాలకు, సుమారు లక్ష ఎకరాల వరకు ఏలేరు నుంచి, పట్టిసీమ, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, చాగల్నాడు తదితర ఎత్తిపోతల పథకాలకు నీటిని తోడుతున్నారు.