సీజనల్ దోపిడీ (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీజనల్ దోపిడీ (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూలై 18 (way2newstv.com): 
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. జిల్లాలో జ్వరాలు విజృంభిస్తుంటాయి. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నా.. జ్వరపీడితులు మాత్రం ఏటా వేల సంఖ్యలో ఉంటారు. ప్రధానంగా డెంగీ ముసుగులో ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు దోచుకుంటున్నారు.  సాధారణ జ్వరాలు అయినా డెంగీ అని, ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి కొన్నాళ్లు ఆసుపత్రుల్లోనే ఉండి చికిత్స పొందాలంటున్నారు. తీరా ప్రాణం మీదకు వచ్చేసరికి విజయవాడ, గుంటూరు వెళ్లాలంటూ రోగుల బంధువుల జేబులు ఖాళీ చేసేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోనే డెంగీ నిర్ధరణ కేంద్రం ఉంది. మిగిలిన చోట్ల ఎక్కడా లేదని జిల్లా వైద్య శాఖాధికారులే చెబుతుండగా- ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు మాత్రం డెంగీ నిర్ధరణ పరీక్ష చేశాం... మీకు పాజిటివ్‌గా వచ్చిందని చెప్పి మనిషి ఒంట్లో రక్తం దోమ పీల్చేస్తున్నట్లుగా ఆర్థికంగా దోచేస్తున్నారు. డెంగీ పరీక్ష కిట్‌లు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. 
 సీజనల్ దోపిడీ (పశ్చిమగోదావరి)

అటువంటప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం రక్తపరీక్ష చేసిన వెంటనే డెంగీ అని ఎలా నిర్ధరిస్తున్నారు అంటే జవాబు ఉండదు. ఒకవేళ రోగుల బంధువులు ఎవరైనా ప్రశ్నిస్తే వైద్యులు మీరా? మేమా? గొడవ చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రాణాపాయంలో ఉన్న రోగుల తరఫున బంధువులు మిన్నకుండిపోతున్నారు.సాధారణంగా మనిషి రక్తంలో 3.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. అనారోగ్యానికి గురైతే ప్లేట్‌లెట్స్‌ కొంత తగ్గుతుంటాయి. డెంగీ జ్వరం బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేలు ప్లేట్‌లెట్స్‌ దిగువకు వస్తే రోగి మూడు, నాలుగు రోజులకే నీరసించిపోతాడు. జ్వరం ఎంతకీ తగ్గదు. శరీర భాగాలు కొన్ని నొప్పిగా ఉండటం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. తలనొప్పితో పాటు కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. డెంగీ జ్వరం అనే అనుమానం ఉంటే ఎన్‌ఎస్‌-1, ఐజీఎం పరీక్షలు చేయాలి. అప్పుడు పాజిటివ్‌గా నివేదిక వస్తే ఎలీసా పరీక్ష చేయించాలి. కొన్నిసార్లు మొదటి రెండు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా ఎలీసా పరీక్షలో నెగిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 146 అనుమానిత కేసులను గుర్తించగా 35 డెంగీ కేసులు అని తేలింది. ప్రైవేటు ఆసుపత్రికి డెంగీ అనుమానిత రోగి వెళ్తే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రైవేటు వైద్యులు కొందరు రోగులను భయపెట్టి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ కుటుంబాలను ఆర్థికంగా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.జిల్లాలోని భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ప్రైవేటు వైద్యశాలలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆసుపత్రి అంటే ఏదొక వైద్యానికి స్పెషలిస్టులు ఉండేవారు. ప్రస్తుతం అన్ని రోగాల వైద్య నిపుణులు తమ ఆసుపత్రిలో ఉన్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. రోగమేదైనా క్షణాల్లో వైద్యం చేస్తామంటూ కొన్ని కార్పొరేట్‌ వైద్యాలయాల నిర్వాహకులు ఊదరగొడుతున్నారు. ఆసుపత్రిలో చేరగానే మెరుగైన వైద్యం అందుతుందని నమ్ముతున్న రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రక్తం, నీరుడు పరీక్షల నుంచి దోపిడీ మొదలవుతుంది. జ్వరం తగ్గే వరకు ఐసీయూలోనే ఉంచాలంటారు. అందుకు రోజుకు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అలా కొన్నిరోజుల పాటు ఐసీయూలో ఉంచిన రోగిని ప్రత్యేక గదికి తరలిస్తారు. అక్కడో వారం రోజులు ఉంచుతారు. రోగి స్థోమతను బట్టి ఎంత వరకు వైద్య ఖర్చుల రూపంలో వసూలు చేయాలో అంత చేసిన తర్వాత మందుల చీటీపై ఖాళీ ఎంత ఉంటుందో అన్ని రకాల ఔషధాలు రాస్తారు. అవి ఆ ఆసుపత్రి మందుల దుకాణంలోనే దొరుకుతాయి. మరెక్కడా ఉండవు. ధరలు ఎక్కువే. అయినా ఏం చేసేది లేక అక్కడ కొంటున్నారు. జిల్లాలో ఎలీసా పరీక్షలు ఒక్క ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులో ఉండటంతో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం తదితర ప్రాంతాల రోగులు రావడం కష్టతరంగా మారింది. ఆయా ప్రాంతాల వారు భద్రాచలం వెళ్తున్నారు. కొవ్వూరు, నిడదవోలుకు చెందిన వారు రాజమహేంద్రవరం, నరసాపురం, పాలకొల్లు పరిసర ప్రాంతాల వారు కాకినాడకు పరుగులు తీస్తున్నారు. చాలా కేసులను విజయవాడ, గుంటూరుకు తీసుకెళ్తున్నారు.