మత్తులో చిత్తుగా.. (ఏలూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మత్తులో చిత్తుగా.. (ఏలూరు)

ఏలూరు, జూలై 24 (way2newstv.com): 
జిల్లాలో గంజాయి మాఫియా పెరిగిపోతోంది. విరివిగా అందుబాటులోకి రావడంతో ఆ మత్తుకు యువత బానిసలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడి విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి ముఠాల సభ్యులు ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటూ కాసులు పండించుకుంటున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా యువతకు ఈ మత్తును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం తదితర ప్రాంతాల్లోని సాంకేతిక, వైద్య విద్య, డిగ్రీ విద్యార్థులు పలువురు గంజాయికి అలవాటు పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్ఛు పోలీసు, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులు గంజాయి ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నా ఏదో ఒక మార్గంలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సరకు కొనుగోలు చేసి జిల్లాకు తీసుకువస్తున్నారు. గతంలో కొందరు సాధువుల వేషంలో గుట్టుగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయించేవారు. 
మత్తులో చిత్తుగా.. (ఏలూరు)

ఇప్పుడు తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఖరీదైన కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. నిర్దేశిత ప్రాంతాలకు గుట్టుగా చేరవేసి విక్రయదారులకు అందిస్తున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సిగరెట్లు, జర్దాలు, కిళ్లీల్లాగా గంజాయి అందుబాటులోకి రావడంతో యువత దానికి బానిసలవుతున్నారు. మత్తుగా.. గాల్లో తేలిపోతున్నట్లు భావన కలుగుతుండటంతో విద్యార్థులు, కార్మికులు దీనికి అలవాటు పడుతున్నారు. ఇదే అదనుగా పోలీసుల కళ్లుగప్పి గంజాయి ముఠాల వారు విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. గత సంవత్సరం రైల్లో పెద్దఎత్తున గంజాయి తీసుకొస్తుండగా ఇతర రాష్ట్రానికి చెందిన 10 మందిని ఏలూరు స్టేషన్‌లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపెద్ద అట్టపెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి ప్రయాణికుల మాదిరిగా రైల్లో వస్తుండగా పోలీసుల తనిఖీలో వీరు పట్టుబడ్డారు. అలాగే ఏలూరు రైల్వే స్టేషన్లో గంజాయి నిల్వలు కలిగి ఉన్న సాధువులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం ఏలూరు సత్రంపాడు యాదవ నగర్‌లో గత సంవత్సరం భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి ముఠాలకు విద్యార్థులు కల్పవృక్షంలా మారారు. కళాశాలల సమీపంలోని చిరు దుకాణాల వద్దకు వచ్చే విద్యార్థులతో గంజాయి ముఠా సభ్యులు పరిచయం పెంచుకుంటున్నారు. అనంతరం వారికి అలవాటు చేస్తున్నారు. చిన్న చిన్న పొట్లాలుగా కట్టి రూ. 100, 200, 300 ధరలకు విక్రయిస్తున్నారు. ఏలూరు శివారులోని పలు కళాశాలల విద్యార్థులకు వల వేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ఓ నిర్మానుష్య ప్రాంతంలో విక్రయిస్తుండగా.. కావాల్సిన వారు అక్కడికే వెళ్లి గంజాయిని కొని అక్కడే తాగి వెళుతున్నారు. గంజాయికి బానిసైన ఓ విద్యార్థి ముఠా సభ్యులకు సన్నిహితంగా మారి ఆ తర్వాత అతనే స్వయంగా విక్రయిస్తున్నాడు. అతనితో పాటు గంజాయికి అలవాటు పడిన వారిని రెండేళ్ల కిందట ఏలూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నా మళ్లీ ఇటీవల గంజాయి ముఠా సభ్యులు కార్యకలాపాల జోరు పెంచినట్టు తెలిసింది.విశాఖ మన్యం నుంచి పెద్ద ఎత్తున గంజాయి కొనుగోలు చేసి కార్లలో గుట్టుగా తరలిస్తున్న ముఠాల కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి పట్టుకుంటున్నారు. రెండు నెలల కిందట ఆశ్రం కళాశాల కూడలిలో రూరల్‌ పోలీసులు వాహనాలను తనిఖీచేసే క్రమంలో ఓ కారు డిక్కీలో ఉన్న 140 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి సరకు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా ఏలూరు రైల్వే పోలీసులు ఈనెల 11న తనిఖీచేసి వారిని అరెస్టు చేశారు. ● గతనెల 26న విశాఖ ఏజెన్సీ నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు 134 కేజీల గంజాయిని తరలిస్తుండగా కొవ్వూరులో పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా కారు డిక్కీలో ఉన్న గంజాయిని గుర్తించారు. ఇద్దరిని అరెస్టుచేసి సరకు స్వాధీనం చేసుకున్నారు. భారీఎత్తున గంజాయి కొనుగోలు చేసే ముఠాలు ఆ సరకును ఆయా పట్టణాల్లోని విక్రయదారులకు అందిస్తుంటారు. వాహనాన్ని ఆయా పట్టణాల మీదుగా తీసుకొచ్చి ఎవరికి ఎంత కావాలో అంత గుట్టుగా దిగుమతి చేసి సొమ్ము తీసుకుని వెళ్తుంటారు. స్థానిక విక్రయదారులు కేజీ, అరకేజీ, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతుంటారు.