వదలని ప్లాస్టిక్ భూతం (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వదలని ప్లాస్టిక్ భూతం (గుంటూరు)

గుంటూరు, జూలై 24 (way2newstv.com): 
ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. రోజురోజుకు ప్లాస్టిక్‌ వాడకం పెరిగిపోవడంతో ఎటుచూసినా వాటి వ్యర్థాలే కనిపిస్తున్నాయి. నగరంలో చెత్తతో పాటు ప్లాస్టిక్‌ను కలిపేసి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఆహార పదార్థాలు ప్లాస్టిక్‌తో పాటు పడేయడంతో వాటిని పశువులు తిని మృత్యువాత పడుతున్నాయి. చెత్తతో కలిపి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగలబెడుతుండటంతో గాలిలో విష రసాయనాలు విడుదలై పరిసరాలు కలుషితమవుతున్నాయి. నగరంలో మురుగు కాలువల ప్రవాహానికి కవర్లు అడ్డుపడి వర్షాలు వచ్చినప్పుడు మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పుతో పాటు మానవ జీవనం దుర్బరమవుతోంది. 
వదలని ప్లాస్టిక్ భూతం (గుంటూరు)

అయినా వాటి వాడకం పెరుగుతూనే ఉంది. ఉదయం పాల ప్యాకెట్‌ నుంచి ప్రతి వస్తువు ప్లాస్టిక్‌ కవర్లలోనే ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. వ్యక్తిగత క్రమశిక్షణతో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు స్థానిక ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ దిశగా కార్యక్రమాలు విస్తృతం చేయాల్సిన తరుణమిదే.గుంటూరు నగర జనాభా 10 లక్షలు. ప్రతి వ్యక్తి సగటున ఏడాదికి 2400 పాలిథిన్‌ కవర్లను వినియోగిస్తున్నారు. ఉదయాన్నే పాల ప్యాకెట్‌ మొదలుకుని రాత్రి పడుకునే వరకు ప్రతి సందర్భంలో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్‌ కవర్లను నిషేధించారు. గుంటూరు నగరంలో రోజుకు 420 టన్నుల చెత్త వస్తుండగా ఇందులో పాలిథిన్‌ వ్యర్థాలు 17 మెట్రిక్‌ టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 10 మెట్రిక్‌ టన్నుల పాలిథిన్‌ రీస్లైకింగ్‌కు వెళుతుండగా మరో 7 టన్నులను చెత్త డంపింగ్‌ యార్డులో వేస్తున్నారు. నగరంలో వచ్చే మొత్తం చెత్తలో 4శాతం ప్లాస్టిక్‌ చెత్త ఉంటుందని అంచనా వేస్తుండగా వాస్తవంగా అది 6శాతం వరకు అని యంత్రాంగం చెబుతోంది. ఈ లెక్కన 25 టన్నులు రాగా 60శాతం పాలిథిన్‌ చెత్త రీసైక్లింగ్‌కు వెళ్లగా మిగిలినది డంపింగ్‌ యార్డులో వేసి తగులబెడుతున్నారు. ప్లాస్టిక్‌ను సేకరించి రీస్లైకింగ్‌ ద్వారా వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలు వృథా ప్లాస్టిక్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ప్లాస్టిక్‌తో వివిధ రకాల వస్తువులు, సామగ్రి, కవర్లు తయారు చేసే కంపెనీలు 200 వరకు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రోజుకు టన్ను ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేస్తుండగా ఇంకొన్ని 5 నుంచి 6 టన్నులు తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న యూనిట్లు ఉన్నాయి. వివిధ పరిమాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లను మొదలుకుని పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ముల వరకు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొన్ని ప్రాంతాల్లో సముద్రంలోకి పారబోస్తున్నారు. కొన్నాళ్లకు చిన్న రేణువులుగా విడిపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు నీటిలో కలిసిపోతాయి. చేపలు ఆహారం తీసుకునే క్రమంలో అతిచిన్న పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేయలేవు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేప తినడం వల్ల వాటిలోకి వెళుతున్నాయి. చేపలను ఆహారంగా తీసుకుంటున్న మనిషి శరీరంలోకి కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోవడం, వాటి రీసైక్లింగ్‌లో ప్రమాణాలు పాటించకపోవడం, డంపింగ్‌ యార్డులో కాల్చి వేయడం వల్ల వాతావరణం కలుషితమవుతోంది. ఒక కిలో ప్లాస్టిక్‌ను మండించడం వల్ల 2.8 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ గాలిలోకి విడుదలవుతుంది. ఇందులో ఉండే ప్యూరన్స్‌, డయాక్సిన్స్‌ క్యాన్సర్‌ కారకాలుగా మారుతున్నాయి. ప్లాస్టిక్‌ను వేడి చేసినప్పుడు దాదాపు 60 రకాల రసాయనాలను విడుదల చేస్తుందని, ఇవన్నీ క్యాన్సర్‌ కారకాలని అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎఫ్‌డీఏ నిర్ధారించింది. ప్రపంచంలో మనిషిని మరణానికి చేరువ చేస్తున్న ప్రధాన కారణాల్లో క్యాన్సర్‌ రెండవది. 2018లోనే క్యాన్సర్‌ వల్ల సుమారు 9.6 మిలియన్ల మంది మరణించారు. ప్రపంచంలో సంభవిస్తున్న ప్రతి ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్‌ వల్లే. క్యాన్సర్‌ కారక మరణాల్లో సుమారు 70శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా దిగువ, మధ్యతరగతి ఆదాయవర్గాల వారు నివసించే దేశాలలో జరుగుతున్నాయి.