మహమ్మారి విజృంభిస్తోంది (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహమ్మారి విజృంభిస్తోంది (తూర్పుగోదావరి)

రాజమండ్రి, జూలై 24 (way2newstv.com): 
జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీ శాక్స్‌ కు నిధులు కేటాయించి హెచ్‌ఐవీ నియంత్రణ, నివారణకు ప్రచారం, రోగులకు ఉచితంగా ఔషధాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ప్రచారం అటకెక్కడంతో క్రమేపీ హెచ్‌ఐవీ బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలో మొదటిసారిగా కాకినాడలో 2002లో ఏఆర్‌టీ సెంటర్‌ ప్రారంభమైంది. 2008లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో, ఆ తరువాత అమలాపురం, తుని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇటీవల బాధితుల సౌకర్యార్థం చింతూరులో నెలకొల్పారు. ఏఆర్‌టీ సెంటర్లలో సుమారు 62 వేలకుపైగా రోగులు నమోదై ఉన్నారు. కాకినాడలో సుమారు 25 వేల మంది, రాజమహేంద్రవరంలో మరో 22 వేల మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీటికి అనుబంధంగా ప్రతి మండలకేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ టెస్టింగ్‌ సెంటర్లు(ఐసీటీఎస్‌) ఏర్పాటు చేశారు.
మహమ్మారి విజృంభిస్తోంది (తూర్పుగోదావరి)

హెచ్‌ఐవీ బాధితుల్లో వ్యాధి తీవ్రతను బట్టి మూడు స్థాయిలుగా రోగులను విభజించి చికిత్స అందిస్తారు. హెచ్‌ఐవీ-1 స్థాయిలో మందులు ఏఆర్‌టీ సెంటర్లలో పుష్కలంగా లభిస్తున్నాయి. వ్యాధిసోకిన తరువాత ఉపయోగించే ఆ మందులు మూడు రకాల సమ్మేళనంతో కలిపి రోగికి అందజేస్తారు. ఈ మందులు కొన్ని నెలలే పనిచేస్తాయి. వ్యాధి ముదిరినకొద్దీ రెండో స్థాయి మందులు వాడాల్సిఉంటుంది. హెచ్‌ఐవీ-2 స్థాయిలో మందులు రెండేళ్లుగా కొరత ఉండటంతో రోగులకు అందించలేకున్నారు. దాంతో కొందరు చేసేదిలేక బయట కొనుగోలుచేస్తున్నారు. మిగిలినవారు నిర్లక్ష్యం చేస్తూ మందులు వాడకపోవడంతో మృత్యువుకు దగ్గరవుతున్నారు.బాధితుల్లో 70 శాతం నిరక్షరాస్యులైన యువతే ఉంటున్నారన్నది ఆందోళన కలిగించే అంశం. క్షేత్రస్థాయిలో ప్రచారం అంతగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 62,756 మంది హెచ్‌ఐవీ రోగులున్నట్లు నమోదుకాగా, వారిలో మందులు వాడుతున్నవారు కేవలం 45,905 మంది మాత్రమే. వీరుకూడా ప్రభుత్వ ఏఆర్‌టీ సెంటర్‌ ద్వారా ఇస్తున్న మందులనే వాడుతున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలను మినహాయిస్తే సీహెచ్‌సీలు-12, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు-2, కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులు, మొత్తం 19 సెంటర్లలో హెచ్‌ఐవీ రోగుల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. రోజుకు 600 మందికి మాత్రమే పరీక్షలు చేయగలుగుతున్నారు. ఇక ఇక్కడికిరాని వారెందరో ఉంటున్నారు.పీహెచ్‌సీల్లోనూ అందుబాటులోకి తేవాలి..ప్రభుత్వాసుపత్రికి వెళ్లే ప్రతి రోగికి హెచ్‌ఐవీ పరీక్ష జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని 19 సెంటర్లతోపాటు 127 ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు అందుబాటులోకి తేవాలి. మందుల కొరత లేకుండా చూడాలి. మందులు ఏఆర్‌టీ సెంటర్లలోనే కాకుండా ఎంపిక చేసిన కేంద్రాల్లో రోగులకు అందేలా చూడాలి. వ్యాధి విస్తరించకుండా అవగాహన కల్పించాలి.