శ్రీసిటీలో జపనీస్ "తొహోకు స్టీల్స్" పరిశ్రమ ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీసిటీలో జపనీస్ "తొహోకు స్టీల్స్" పరిశ్రమ ప్రారంభం


 చిత్తూరు, జులై 19 (way2newstv.com):
శ్రీసిటీలో జపాన్ దేశానికి చెందిన తొహోకు స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ "తొహోకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" నూతన పరిశ్రమను శుక్రవారం ప్రారంభించారు. తొహోకు స్టీల్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హీరోకి యమడ, ప్రెసిడెంట్ షింజి నరుసే, డైడో స్టీల్ వైస్ ప్రెసిడెంట్ సుకసా నషీమురో ఇంకా పలువురు తొహోకు కస్టమర్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసిటీ ప్రతినిధిగా శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్ పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోకి యమడ మాట్లాడుతూ, శ్రీసిటీలో పలు వ్యాపార అనుకూలతల దృష్ట్యా తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ స్థాపించామని అన్నారు. గత 40 ఏండ్లుగా భారతదేశంలోని తమ వినియోగదారులకు జపాన్ లోని తమ పరిశ్రమలో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, ఇకమీద శ్రీసిటీ ప్లాంట్ ద్వారా దేశీయంగా పెరుగుతున్న గిరాకీకి ధీటుగా సరఫరా చేయగలమని చెప్పారు. 

శ్రీసిటీలో జపనీస్ "తొహోకు స్టీల్స్" పరిశ్రమ ప్రారంభం

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో తొహోకు స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. శ్రీసిటీలో ఏర్పాటైన ఈ ప్లాంట్ భారత్ లో తొహోకు స్టీల్ సంస్థకు చెందిన మొట్టమొదటిది అన్నారు. తొహోకు వ్యాపారవృద్ధిలో ఇదో మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా భారత్ మార్కెట్ లో లీడర్లుగా ఎదగాలన్న వీరి లక్ష్యాన్ని ఆయన స్వాగతించారు. ఆటోమొబైల్ రంగానికి చెందిన తయారీరంగ పరిశ్రమలు ఎక్కువ శాతం శ్రీసిటీలో ఏర్పాటు కావడం జరిగిందని, ఈ జాబితాలో మరో పరిశ్రమ చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాహనాల్లో వాడే ఇంజిన్ వాల్వ్ ల తయారీకి అవసరమైన, ఎక్కువ వేడిని తట్టుకునే ఉక్కు కడ్డీలను రూపొందించడంలో ప్రపంచ గుర్తింపు కలిగిన తొహోకు స్టీల్ సంస్థ, శ్రీసిటీ ప్లాంట్ ద్వారా మరింత వృద్ధి సాదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  శ్రీసిటీ మరియు సమీప పరిసరాలలో వున్న ఆటోమొబైల్ పరిశ్రమలకు ఈ పరిశ్రమ ఎంతో ప్రయోజనకరంగా వుంటుందని తెలిపారు, శ్రీసిటీలోని డీటీజెడ్ ఏరియాలో 6 ఎకరాల స్థలంలో సుమారు 80 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంటును నిర్మించారు.  ఆటోమొబైల్ ఇంజిన్ వాల్వ్ లు, ఆటోమొబైల్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ల కోసం అవసరమైన ఉక్కు కడ్డీలు మరియు సాఫ్ట్ మాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కడ్డీలను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఆధునిక కంప్యూటరైజ్డ్ యంత్రాలు గల ఈ పరిశ్రమలో సుమారు 50 మందికి ఉపాధి లభిస్తుంది. రానె ఇంజన్ వాల్వ్, డ్యురో వాల్వ్స్, షిరిరామ్ పిస్టన్స్ & రింగ్స్, నిటాన్ ఇండియా మొదలైనవి దీని ప్రధాన వినియోగదారులు. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 350 టన్నులు కాగా, అంచలంచలుగా 2000 టన్నులకు చేరుకుంటుంది.