ఆషాడమొచ్చినా ఆదాయమేదీ..? (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆషాడమొచ్చినా ఆదాయమేదీ..? (అనంతపురం)

హిందూపురం, జూలై 26 (way2newstv.com): 
ఆషాఢ మాసంలో పట్టు చీరల కార్మికులకు కష్టాలు వచ్చి పడ్డాయి. నేస్తున్న చీరలకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో అయిన కాడికి మాస్టర్‌ వీవర్లకు కట్టబెడుతున్నారు. ఈ మాసంలో శుభకార్యాలు లేకపోవడం, చీరలు కుప్పలుతెప్పలుగా నిలిచిపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రూ.కోట్ల విలువైన చీరలు సిల్క్‌ సెంటర్లలో పేరుకుపోతున్నాయి. దీంతో చేనేత రంగంపై ఆధారపడి జీవించేవారు మగ్గాలు మడతపెట్టి.. ఇతర ఉపాధి మార్గాలు చూసుకొంటున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొంటున్నామని చెబుతున్నా.. వాస్తవానికి జిల్లాలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్న చేనేతలకు నోటీసులు అందుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆషాఢ మాసం.. పట్టు చీరలకు పేరొందిన ముద్దిరెడ్డిపల్లిలో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది. 
ఆషాడమొచ్చినా ఆదాయమేదీ..? (అనంతపురం)

హిందూపురంలో నిత్యం పట్టు చీరల లావాదేవీలు రూ.5 కోట్లకుపైగా జరుగుతాయి. అలాంటిది ప్రస్తుతం రూ.2.50 కోట్లకు పడిపోయింది. ఫలితంగా వ్యాపారుల వద్ద పట్టు చీరలు పేరుకుపోయాయి.ఒకవైపు మగ్గాలు నడవక.. మరో వైపు మరమగ్గాల పోటీ, విద్యుత్తు కోతలు తట్టుకోలేక నేతన్నలు డీలా పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 1.75లక్షల మంది చేనేతలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం మరమగ్గాల్లో చేనేతలకు సంబంధించి 11 రకాల డిజైన్లను నేయరాదని నిబంధన ఉన్నా వాటిని అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వం అందించే అన్ని రాయితీలు పొందుతున్నారు. కాని చేతి మగ్గంలో పట్టు చీరను నేసే కార్మికుడికి మాత్రం రాయితీలు దరి చేరడం లేదు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో మరమగ్గాలే అధికంగా ఉన్నాయి. పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లోనే 3 వేల చేతి మగ్గాలు, 10 వేల మరమగ్గాలు, 15 వేల మంది కార్మికులు ఉన్నారు. నిత్యం వీటి ద్వారా 15వేలకు పైగా చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. రోజురోజుకు ఈ నిల్వలు పెరిగిపోతున్నాయి. పెద్దరెడ్డిపల్లి, వీవర్స్‌కాలనీ, చౌడేశ్వరీ కాలనీ, గోరంట్ల, సోమందేపల్లి ప్రాంతాల్లో 17 వేల మగ్గాలు ఉండగా పట్టుచీరలు అమ్ముడుపోక.. అయిన ధరకే సిల్కు సెంటర్ల యజమానులకు అమ్ముతున్నారు. బయట మార్కెట్‌లో చీరలు అడిగే వారు లేకపోవడం.. ఆషాఢ మాసం వచ్చిందంటే ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ మాసంలో చీరల నిల్వలు పెరిగితే ఆ ప్రభావం మూడు నెలలు ఉంటోందని చేనేత కార్మికుడు ఆంజనేయులు తెలిపారు. ఓ వైపు బ్యాంకులు రుణాలు చెల్లించాలని నోటీసులు అందిస్తుండగా.. మరో వైపు కార్మికులకు అప్పులు ఇచ్చిన మాస్టర్‌ వీవర్లు నేతన్నను పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రభుత్వం చేనేత సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేరుగా చీరలు కొనుగోలు చేయాలని దశాబ్ద కాలంగా కార్మికులు డిమాండు చేస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయం.