కాకినాడ, జూలై 26 (way2newstv.com):
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. చిన్నారులకు భవిష్యత్తులో దృష్టి లోపం రాకుండా ముందస్తుగా వేసే ‘ఏ’ విటమిన్ సిరప్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభ్యం కావడం లేదు. చాలా కాలంగా ఆయా వైద్యశాలల్లో ఈ మందు కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. రాజమహేంద్రవరంలోని వైద్య, విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రితో సహా నగరాలు, పట్టణాల్లో ఉన్న ఈ-పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఈ సమస్య తలెత్తింది.జిల్లాలో ఎనిమిది నెలల నుంచి ఏ-విటమిన్ సిరప్ సరఫరా నిలిచిపోయింది. అప్పట్లో వచ్చిన మందును స్టాకు ఉన్నంత వరకు వేశారు. ప్రస్తుతం లేకపోవడంతో వైద్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ‘ఏ’ విటమిన్ ద్రావణాన్ని చిన్నారులకు వేయడం ద్వారా భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
ఎక్కడికెళ్లాలి..? (తూర్పుగోదావరి)
కానీ పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నారుల తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పిల్లలకు రేచీకటి, ఇతర కంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించిన గత ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి అయిదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికీ ఆరు నెలలకు ఒక సారి ‘ఏ’ విటమిన్ వేయాలని నిర్ణయించింది. తొమ్మిది నెలల నుంచి అయిదేళ్లలోపు వయసున్న చిన్నారులు ప్రస్తుతం జిల్లాలో 1,53,688 మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. పిల్లలకు ఏ- విటమిన్ సిరప్ వేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఆయా వైద్యశాలల్లో వారంలో రెండు రోజులు (బుధ, శనివారాలు) వ్యాక్సిన్ వేస్తారు. ఆ రోజుల్లో ఏ- విటమిన్ సిరప్‌ను పిల్లలకు వేయించేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండటం లేదు.ఏ- విటమిన్ సిరప్‌ను మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాలంటే కంపెనీలను బట్టి రూ.1800 నుంచి రూ.2100 వరకు ధర పలుకుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులకు అధిక మొత్తం వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సిరప్ వేయించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు ఉండటం లేదు. దీంతో ఎక్కువ మంది పిల్లలకు ఈ మందును వేయించడం లేదు. ఒక డోస్ వేయించిన చిన్నారికి విధిగా రెండు, మూడు డోసులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మందు కొరత వల్ల పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక డోస్‌తోనే సరిపెడుతున్నారు. దీనివల్ల ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు ఏ-విటమిన్ సిరప్‌ను తక్షణం సరఫరా చేసేలా చూడాల్సిన అవసరముంది.