ఒక్క పేరు రెండుఓట్లు.. (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక్క పేరు రెండుఓట్లు.. (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూలై 26  (way2newstv.com):
పల్లెల్లో ఓట్ల సందడి ముగిసింది. పట్టణంలో మిగిలి ఉండటంతో ఇక్కడా ఓటేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటు నమోదుకు సమయం ఉండటంతో ఈ అవకాశాన్ని కొందరు ఆశావహులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయా వార్డుల్లో వలస వచ్చిన వారిని గుర్తించి.. నమోదులు చేయిస్తున్నారు. మరోపక్క సమీపంలో ఉండే మహారాష్ట్రకు చెందిన వారితో సైతం నమోదు దరఖాస్తు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి తెలిసిన వారి చిరునామాలు తీసుకొని.. ఇక్కడే అద్దెకు ఉంటున్నట్లు ఆధారాలు చూపించి.. వారి ఓట్లను నమోదు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కాలనీల్లో ఈ తంతు జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తుండటంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమవుతోంది. అంతర్జాలంలో ఎక్కువగా దరఖాస్తులు వస్తుండటంతో వాటిని ప్రింట్‌ తీసుకొని క్షేత్రస్థాయి విచారణ కోసం పంపిస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. 
ఒక్క పేరు రెండుఓట్లు.. (ఆదిలాబాద్)

ఎన్నికల బరిలో నిలిచే కొందరు ఔత్సాహికులు వారికి అనుకూలమైన ఓట్ల కోసం తాపత్రయపడుతూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం.పట్టణంలో నివాసముండి.. ఓటు హక్కు లేకపోయినా.. వారు నివాసం ఉన్న ప్రాంతాల్లో కాకుండా.. ఇతర చోట్ల ఓటు వస్తే.. కొత్తగా నమోదు చేసుకోవడంతో పాటు మార్పులు- చేర్పులు చేసేందుకు అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అంతర్జాలం ద్వారా, తహసీల్దార్‌ కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్ఛు ఫారం - 6 దరఖాస్తు పూర్తిచేసి పాస్‌పోర్టు ఫోటో, చిరునామా గుర్తింపు కార్డు, వయసు నిర్ధరణ పత్రం జతచేసి ఓటు నమోదు చేసుకోవచ్ఛు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఓ.తెలంగాణ.ఎన్‌ఐసీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో ద్వారానూ నమోదుకు అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి.. క్షేత్రస్థాయి విచారణ కోసం బీఎల్‌ఓలకు అప్పగిస్తారు. వారు ఆయా చిరునామాలకు వెళ్లి దరఖాస్తుదారులు అర్హులేనా కాదా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అర్హులైతే వారికి ఓటుహక్కు కల్పిస్తారు. అనర్హులైతే.. దరఖాస్తులను తిరస్కరిస్తారు. ప్రస్తుతం పురపాలక తుది ఓటరు జాబితా విడుదలైనా.. కొత్తగా నమోదు చేసుకున్న వారికి వార్డుల వారీగా రూపొందించిన జాబితా చివరన అనుబంధంగా ఈ కొత్త పేర్లను జత చేస్తారు. త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేంతవరకు దరఖాస్తులు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది. ప్రస్తుతం వార్డుల వారీగా జాబితాలు విడుదల చేసిన సందర్భంగా ఆయా వార్డుల్లో మీ ఓటు ఉందా.. లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ జాబితాలో కనిపించకపోతే.. వెంటనే అవసరమైన పత్రాలు జత చేసి నమోదు చేసుకోవడం ఉత్తమం. త్వరలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ లోగా దరఖాస్తులు సమర్పిస్తేనే ఓటు హక్కు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే పురపాలక ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కోల్పోవాల్సి వస్తుంది.