శిధిలావస్థకు చేరుకన్న మండల పరిషత్ భవనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శిధిలావస్థకు చేరుకన్న మండల పరిషత్ భవనాలు

విజయనగరం, జూలై 13, (way2newstv.com)
విజయనగరం జి మాడుగుల మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. పరాయిపంచన నిర్వహిస్తన్న భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ సొంత భవనాల్లేక పరాయి పంచన కొనసాగుతున్నాయి. మండలం ఏర్పాటైన నాటి నుంచి ఇదే పరిస్థితి. ఐటిడిఎ, మండల పరిషత్‌ కార్యాలయాల పరిధిలోని క్వార్టర్స్‌లో వీటిని నడుపుతున్నారు. ఆయా భవనాలు నిర్మించి 40 ఏళ్లు దాటుతోంది. సౌకర్యాలు లేవు. శిథిలమై భవనాలు పెచ్చులూడి పడుతుంటే చేసేదీలేక భయం భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ భవనాల దుస్థితిని గమనించిన ఇంజినీరింగ్‌ అధికారులు, ఏ క్షణాన్నైనా కూలిపోయే అవకాశం ఉందని, ఆయా భవనాల్లో మెలగడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. 
 శిధిలావస్థకు చేరుకన్న మండల పరిషత్ భవనాలు

కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడే ఉంటూ విధులను నిర్వహిస్తున్నారు. శిథిల భవనాలు, పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్న వాటిలో పిఎసిఎస్‌, 108, బిఎస్‌ఎన్‌ఎల్‌, కాఫీ, పోస్టల్‌ కార్యాలయాలు, గ్రామీణ, యూనియన్‌ బ్యాంకులు ఉన్నాయి. మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఉపయోగించకపోవడంతో ఆ భవనం కూడా శిథిలమై నిరుపయోగంగా ఉంది. ఆయా కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షం పడితే ఆయా కార్యాలయాల్లో రెండు, మూడు రోజుల వరకు పైకప్పు, గోడల నుంచి నీరు చిమ్ముతూనే ఉంటోందని స్థానికులు అంటున్నారు. ఆయా కార్యాలయాలకు భవనాలు లేవంటూ పాడేరులో మకాం వేసి విధులను నిర్వహిస్తున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌ శాఖ, టిడబ్ల్యు, పిఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఎస్‌ఎంఐ, ఆర్‌ అండ్‌ బి, ఎక్సైజ్‌, కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో విధులంతా పాడేరు కేంద్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.